ఆస్ట్రేలియాకు షాక్: ఇండియాపై నాలుగో టెస్టుకు పకోవస్కీ దూరం

By telugu teamFirst Published Jan 14, 2021, 1:28 PM IST
Highlights

శుక్రవారం ఇండియాతో తుది క్రికెట్ టెస్టు మ్యాచు జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా పకోవస్కీ నాలుగో టెస్టుకు దూరమవుతున్నాడు. అతని స్థానంలో హరిస్ జట్టులోకి వస్తున్నాడు.

బ్రిస్బేన్: టీమిండియాతో శుక్రవారం బ్రిస్బేన్ లో ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ విల్ పకోవస్కీ దూరమయ్యాడు. అతని స్థానంలో మార్కుస్ హరిస్ తుది జట్టులో చేరాడు. గాయం కారణంగా నాలుగో టెస్టులో పకోవస్కీ ఆడడం లేదు. ఈ విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేసింది. 

సిడ్నీలో జరిగిన మూడో టెస్టు మ్యాచులో ఐదో రోజు ఫీల్డింగ్ చేస్తూ పకోవస్కీ గాయపడ్డాడు. ఓ బంతిని ఆపే క్రమంలో అతను డైవ్ చేస్తూ కిందపడ్డాడు. దీంతో అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో పకోవస్కీ నాలుగో టెస్టు కోసం ట్రైనింగ్ కు రాలేదు. పకోవస్కీ చివరి టెస్టులో ఆడండ లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు.

పకోవస్కీ సిడ్నీ టెస్టుతోనే తన అంతర్జాతీయ కెరీర్ కు శ్రీకారం చుట్టాడు. వార్నర్ తో కలిసి అతను ఇన్నింగ్సును ప్రారంభించాడు. తొలి ఇన్నింగ్సులో 62 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్సులో 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. 

పకోవస్కీ స్థానంలో తుది జట్టులోకి వస్తున్న మార్కుస్ హరిస్ 2019లో యాషెస్ సిరీస్ లో ఆడాడు. అుప్పుడు బాన్ క్రాఫ్ట్ కు బదులుగా అతను తుది జట్టులోకి వచ్చాడు. అయితే అతను ఆరు ఇన్నింగ్సుల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. 

ఇప్పుడు హరిస్ మంచి ఫామ్ లో ఉన్నాడని, దేశవాళీ క్రికెట్ లో బాగా రాణించాడని పైన్ చెప్పాడు. అందుకే అతన్ని ఇండియాతో జరిగే తుది టెస్టు మ్యాచుకు ఎంపిక చేశామని కూడా చెప్పాడు 

ఇప్పటి వరకు జరిగిన టెస్టు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో మ్యాచును గెలుచుకున్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది. 

click me!