ఇండోర్‌లో తగ్గిన వాన, మారిన టార్గెట్... సిరీస్ నిలవాలంటే ఆస్ట్రేలియా ముందు....

By Chinthakindhi Ramu  |  First Published Sep 24, 2023, 8:33 PM IST

9 ఓవర్లు బ్యాటింగ్ చేసి 56 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... డీఎల్‌ఎస్ విధానం ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్ణయించిన అంపైర్లు...


ఇండోర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో వరుణుడి కారణంగా ఆటకు రెండోసారి అంతరాయం కలిగింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9.5 ఓవర్లు అయ్యాక వర్షం రాగా, ఆసీస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు ముగియగానే వాన కురిసింది. 400 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి రెండో ఓవర్‌లోనే డబుల్ షాక్ తగిలింది..

8 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి స్టీవ్ స్మిత్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్టీవ్ స్మిత్..

Latest Videos

undefined

వన్డేల్లో స్టీవ్ స్మిత్‌కి ఇది రెండో గోల్డెన్ డకౌట్. ఇంతకుముందు 2017లో పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్, స్టీవ్ స్మిత్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాని డేవిడ్ మార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఇద్దరూ ఆట నిలిచే సమయానికి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ వార్నర్ 24 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు, లబుషేన్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా గంటకు పైగా ఆట నిలిచిపోవడంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని డీఎస్‌ఎస్ విధానం ప్రకారం 33 ఓవర్లో 317 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు. అంటే ఇప్పటికే 9 ఓవర్లు బ్యాటింగ్ చేసి 56 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, 24 ఓవర్లలో 261 పరుగులు చేయాల్సి ఉంటుంది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే అవుటైనా శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఇరగదీయగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రతాపం చూపించాడు. 

click me!