సెంచరీలు బాదిన శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్... కెప్టెన్ కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్... సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ ఫినిషింగ్..
ఇండోర్‌లో వరుణుడు కాసేపు కురిసి బ్రేక్ ఇచ్చాడు. అయితే భారత బ్యాటర్లు మాత్రం ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే అవుటైనా శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఇరగదీయగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రతాపం చూపించాడు.
undefined
నాలుగో ఓవర్‌లోనే రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. క్రీజులోకి వస్తూనే ఆసీస్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు శ్రేయాస్ అయ్యర్. మరో ఎండ్‌లో 19 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసిన శుబ్‌మన్ గిల్, అయ్యర్ దూకుడు చూసి తాను కూడా స్పీడ్ పెంచాడు..
86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. అయ్యర్ వన్డే కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. సెంచరీ తర్వాత సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్...
క్యాచ్ పట్టిన తర్వాత సీన్ అబ్బాట్ చేతిలోని బంతి, నేలను తాకినట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రిప్లైకి ముందు పెవిలియన్‌కి వెళ్లిన శ్రేయాస్ అయ్యర్, థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చాడు. వస్తూనే ఫోర్ బాదాడు..
ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి, పెవిలియన్ చేరాడు శ్రేయాస్ అయ్యర్. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గత మ్యాచ్‌లో 70+ స్కోరు చేసిన శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో సెంచరీతో ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు..
ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఈ బుధవారం ప్రకటించే తాజా ర్యాంకింగ్స్‌లో నెం.1 ప్లేస్‌ని దక్కించుకోవడం ఖాయం. 92 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు శుబ్‌మన్ గిల్. 35వ వన్డే ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి ఇది ఆరో సెంచరీ కాగా, ఈ ఏడాది ఐదోది.
90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కెఎల్ రాహుల్...
మొదటి 9 బంతుల్లో 4 పరుగులే చేసిన సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6 బాదాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో వన్డేల్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.. జడేజా 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు.