IND vs AFG: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం (Holkar Stadium - Indore)లో ఆదివారం నాడు భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ తరుణంలో ఇండోర్ టీ20 మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి.. సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ఇక్కడి పిచ్, వాతావరణం ఎలా ఉందనేది ఓ సారి లూక్కేందాం..
IND vs AFG: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా ఆదివారం నాడు భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) తలపడనున్నాయి. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించగా.. తాజాగా రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా ప్రయత్నిస్తోంది. అయితే.. ఇండోర్ పిచ్, వాతావరణం ఎలా ఉండబోతుందనేది చర్చనీయంగా మారింది. మొహాలీ తరహాలో ఇండోర్ వాతావరణం ఆటగాళ్లకు సవాల్‌గా మారనుంది.
వాతావరణం ఎలా ఉంటుంది?
ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదని, మ్యాచ్ మొత్తాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా చూడవచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉంటుంది.
తేమ దాదాపు 49 శాతం ఉంటుంది. అయినా ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తంమీద ఇండోర్ వాతావరణం ఆటగాళ్లకు, అలాగే.. ప్రేక్షకులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. గాలి వేగం గంటకు 13 కి.మీ.వీస్తుండటంతో కాస్తా చల్లదనాన్ని ఇస్తుంది. ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్‌కు ఈ వాతావరణం చాలా అనువైనది. వాతావరణం కారణంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఆటగాళ్లు తమ ప్రదర్శన ఇచ్చేందుకు సరైన అవకాశం లభిస్తుంది.
పిచ్ ఎలా ఉంటుంది?
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే.. చిన్న బౌండరీ లైన్ ఉండటంతో బ్యాట్స్‌మెన్‌కి బౌండరీలు, సిక్సర్లు బాదడం చాలా సులభంగా ఉంటుంది. ఈ పిచ్‌పై సగటు టీ20 స్కోరు 210 పరుగులుగా నమోదైంది. అందువల్ల టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టుకు కాస్తా కలిసివస్తోంది. ఇప్పటి వరకు రెండు టీ20 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా గెలుపొందగా, ఛేజింగ్ టీమ్ ఒకసారి గెలిచింది.
ఈ మ్యాచ్‌లలో గెలిచిన జట్టు 200 కంటే ఎక్కువ స్కోర్ చేసింది. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 260 పరుగులు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మైదానంలో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. 2017లో ఈ స్టేడియంలో జరిగిన భారత్ - శ్రీలంకపై రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. ఈ రికార్డులను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌లో కూడు పరుగుల వరద పారడం ఖాయమే.
టాసే కీలకం
అదే సమయంలో భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో టాసే కీలకం. ఇండోర్‌లో రాత్రి ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయే అవకాశముంది. అలాగే.. రాత్రి పెరిగే కొద్దీ మంచు దానిపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోవైపు.. ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ 14 నెలల తర్వాత భారత్ తరఫున టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు అతనిపైనే ఉంది. అటువంటి పరిస్థితిలో టిమిండియా ఆటగాడు ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే.
అయితే.. గత రికార్డులను పరిశీలిస్తే.. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. కేవలం ఒక టీ20, 1 టెస్టు మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించాలని భావిస్తోంది.
ఇరు జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్ ఉల్ జీబ్ హక్, ముమాన్.