
ఇన్నింగ్స్ మొదలైన కొద్ది సేపటికే వెస్టిండీస్ టాప్‌ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 12 పరుగులకే తొలి వికెట్, 20 పరుగులకే రెండో వికెట్‌ను కోల్పోయారు. ఓపెనర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (0, 11 బంతులు) ఖాతా తెరవకుండానే ఔటవగా, మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (8, 19 బంతులు, 2 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.
ఓపెనర్లు ఔటైన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. అలిక్ అథనేజ్ (12, 24 బంతులు, 2 ఫోర్లు), బ్రెండన్ కింగ్ (13, 15 బంతులు, 3 ఫోర్లు) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. షై హోప్ (26, 36 బంతులు, 3 ఫోర్లు) కాస్త ప్రతిఘటన చూపించినా, అతడిని కూడా భారత్ బౌలర్లు కట్టడి చేశారు.
వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ (22, 35 బంతులు, 4 ఫోర్లు) ఒక్కరే జట్టును నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 24 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొదట్లోనే చందర్‌పాల్‌ను ఔట్ చేసి టీమ్‌ఇండియాకు మొదటి వికెట్‌ను సాధించాడు. లంచ్ బ్రేక్‌కి ముందు వరకు 7 ఓవర్లు వేసి 3 వికెట్లు సాధించాడు. కాగా లంచ్ బ్రేక్ తర్వాత రోస్టన్ రూపంలో మరో కీలక వికెట్‌ను పడగొట్టాడు. మరోవైపు జస్‌ప్రీత్ బుమ్రా క్యాంప్‌బెల్ వికెట్ తీసుకోగా, కుల్‌దీప్ యాదవ్ షై హోప్‌ను ఔట్ చేశాడు. కాగా 28 ఓవర్లకు వెస్టిండిస్ 6 వికెట్ల నష్టానికి 115 పరుగుల వద్ద కొనసాగుతోంది.