
మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడి, 2-0 తేడాతో సిరీస్‌లో వెనకబడిన టీమిండియా, ఆఖరి టీ20లోనూ ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకి కట్టడి చేయలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది.
వెస్టిండీస్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్ కలిసి తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం అందించారు. గత రెండు మ్యాచుల్లో స్పిన్నర్ల కోటా పూర్తి చేయించలేదని విమర్శలు రావడంతో నేటి మ్యాచ్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా భిన్నంగా స్పందించాడు.
మూడో ఓవర్‌లో అక్షర్ పటేల్, నాలుగో ఓవర్‌లో యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌కి వచ్చారు. పవర్ ప్లేలో స్పిన్నర్లతోనే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాడు హార్ధిక్ పాడ్యా. 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కైల్ మేయర్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన జాన్సన్ ఛార్లెస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన నికోలస్ పూరన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు..
42 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గాయంతో రెండో టీ20కి దూరమైన కుల్దీప్ యాదవ్, నేటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు..
ఈ 3 వికెట్లతో టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న కుల్దీప్ యాదవ్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. యజ్వేంద్ర చాహాల్ 34 ఇన్నింగ్స్‌ల్లో 50 టీ20 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ కేవలం 29 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. బుమ్రా 41, అశ్విన్ 42, భువీ 50, హార్దిక్ 57, జడేజా 60 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నారు.
ఓవరాల్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50 టీ20 వికెట్లు తీసిన రెండో బౌలర్ కుల్దీప్ యాదవ్. శ్రీలంక క్రికెటర్ అజంతా మెండీస్ 26 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసి ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు.
స్పిన్నర్ల కారణంగా ముకేశ్ కుమార్ 18వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్‌ని తన బౌలింగ్‌లో మొదటి బంతికే అవుట్ చేశాడు ముకేశ్ కుమార్. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన రోవ్‌మెన్ పావెల్ 17 పరుగులు రాబట్టాడు.
ముకేశ్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో సిక్సర్ బాది 11 పరుగులు రాబట్టాడు పావెల్. 19 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్‌తో పాటు రొమారియో షెఫర్డ్ 5 బంతుల్లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... నేటి మ్యాచ్‌లో స్పిన్నర్లు యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ కోటాని పూర్తి చేసుకోగా ముకేశ్ కుమార్ 2, అర్ష్‌దీప్ సిగ్, హార్ధిక్ పాండ్యా మూడేసి ఓవర్లు మాత్రమే వేశారు..