Ind vs SL: నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు దద్దరిల్లే.. టీమిండియా అదరగొట్టేనే..

Published : Feb 27, 2022, 09:17 AM ISTUpdated : Feb 27, 2022, 09:19 AM IST
Ind vs SL: నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు దద్దరిల్లే.. టీమిండియా  అదరగొట్టేనే..

సారాంశం

India Vs Srilanka T20I Series: లంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే రోహిత్ సేన సిరీస్ పట్టేసింది.  ధర్మశాలలో జరిగిన రెండో టీ20లో శ్రేయస్ అయ్యర్, సంజూశాంసన్,  రవీంద్ర జడేజాలు వీరవిహారం చేశారు. 

రోహిత్ శర్మ  సారథ్యంలోని  టీమిండియా అదరగొడుతున్నది. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్న రోహిత్ సేన.. టీ20లలో  వరుసగా అత్యధిక  విజయాలు (11) సాధించి..  ఈ జాబితాలో  అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘాన్ (12 విజయాలు) ను దాటడానికి  ప్రణాళికలు సిద్ధం చేసింది. శనివారం  భారత బౌలర్లు విఫలమైన చోట బ్యాటర్లు  దుమ్ములేపారు.  ఓపెనర్లిద్దరూ  విఫలమైనా..  తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్,  సంజూ శాంసన్,  రవీంద్ర జడేజా లు లంక బౌలర్లకు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ధర్మశాల గ్రౌండ్ లో కూడా  చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్యాన్ని ఒక పద్ధితిగా బాదుత.. మరో 17 బంతులు మిగిలుండగానే ఊదేసింది. 

నిన్నటి మ్యాచులో టీమిండియా విజయంలో క్రెడిట్ అంతా  అయ్యర్, శాంసన్, జడ్డూలదే.  పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్నా..  భారీ లక్ష్యం కావడంతో ఆదిలోనే భారత్ తడబడింది.  కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగుమాత్రమే చేసి  బౌల్డ్ కాగా.. తొలి టీ20 లో 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ (15 బంతుల్లో 16 పరుగులు) కూడా క్రీజులో నిలవడానికి ఇబ్బంది పడ్డాడు.

 

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన అయ్యర్ (44 బంతుల్లో 74 నాటౌట్.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు)  కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  సంజూ శాంసన్ (25 బంతుల్లో 39.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (18 బంతుల్లో కలిసి 45 నాటౌట్..7 ఫోర్లు, ఒక సిక్సర్) లతో కలిసి  దుమ్ము దులిపాడు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పినట్టు.. ఏదో గులాబి మొక్కకు అంటు కట్టినట్టు.. ఒక పద్దతిగా కొట్టాడు. ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉన్నా తొణగకుండా ఆడాడు.  పరిస్థితులను ఆకలింపు చేసుకుని  మంచి బంతులను గౌరవిస్తూనే గతి తప్పిన బాల్స్ ను శిక్షించాడు. 

అయ్యర్ కు తోడుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన శాంసన్.. తొలుత ఆచితూచి ఆడాడు. కానీ లాహిరు వేసిన 12 వ ఓవర్లో అతడికి విశ్వరూపం చూపాడు.  ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్ తో 23 పరుగులు రాబట్టాడు. కానీ అదే ఓవర్ ఆఖరు బంతికి స్లిప్స్ లో బినుర పట్టిన అద్భుత క్యాచ్ తో ఔటయ్యాడు.

 

శాంసన్ నిష్క్రమించాక  క్రీజులోకి వచ్చిన జడ్డూ.. వస్తూనే  ఫోర్లతో విరుచుకుపడ్డాడు. లంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీల మోత మోగించాడు. మరో ఎండ్ లో అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని బాదుడు కొనసాగించగా..   అతడికి  జతకలిసిన జడ్డూ కూడా  దుమ్ము దులిపాడు. దీంతో 184 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.1 ఓవర్లలోనే ఛేదించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను 2-0తో గెలుచుకుంది.  భారత్ కు ఇది వరుసగా మూడో (వెస్టిండీస్ తో  వన్డే, టీ20) సిరీస్ విజయం. 

అయ్యర్, జడ్డూల ధాటికి లంక  బౌలర్ల సగటు పది దాటింది.  భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే  రోహిత్ ను ఔట్ చేసిన చమీర.. 3.1 ఓవర్లు బౌలింగ్ చేయగా 39 పరుగులిచ్చాడు. బినుర ఫెర్నాండో 4 ఓవర్లు వేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. లాహిరు కుమార మూడు ఓవర్లలో 31 పరుగులివ్వగా.. కెప్టెన్ దసున్ శనక 2 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చాడు.  

అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు.  మంచు ను దృష్టిలో ఉంచుకుని  ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. నిస్సంక (75), గుణతిలక (38) లు మంచి ఆరంభాన్నిచ్చారు.  తొలి వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కానీ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో లంక వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.  కానీ ఆఖర్లో వచ్చిన కెప్టెన్ శనక.. (19 బంతుల్లో 47 నాటౌట్) వీరవిహారం చేశాడు. దీంతో లంక 183 పరుగుల భారీ స్కోరు చేసింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !