
ఐపీఎల్ 2023-27 సీజన్‌లకు సంబంధించిన మీడియా ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.40 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించబోతోంది భారత క్రికెట్ బోర్డు. ఒక్కో మ్యాచ్ ద్వారా రూ.107.5 కోట్లకు పైగా సొమ్ము, బీసీసీఐ హుండీలో చేరనుంది. మీడియా ప్రసార హక్కుల విక్రయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడానికి ముందే భారత మాజీ క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్‌ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
ప్రస్తుతం మాజీ క్రికెటర్లకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకూ పెన్షన్‌గా చెల్లిస్తోంది బీసీసీఐ. రిటైర్మెంట్‌కి ముందు సదరు క్రికెటర్ పొందిన కాంట్రాక్ట్, పొందిన వేతనం మీద ఆధారపడి వారికి చెల్లించే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.15 వేలు, రూ.22,500ల పెన్షన్ పొందే వారికి 100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు...
అంటే ఇంతకుముందు రూ.15 వేలు తీసుకునే మాజీ క్రికెటర్లు, అంపైర్లు.. ఇకపై నెలకు రూ.30 వేలు అందుకోబోతున్నారు. అలాగే రూ.22,500ల మొత్తం అందుకునేవారికి రూ.45 వేలు బ్యాంకులో జమ కానుంది. రూ.30 వేలు తీసుకునే వారికి ఇకపై రూ.52,500, రూ.37,500లకు మొత్తం అందుకునేవారికి ఇకపై రూ.60 వేలు ఖాతాలో చేరనుంది...
ఇంతకుముందు రూ.50 వేలు అందుకునే మాజీ క్రికెటర్లు ఇకపై రూ.70 వేలు అందుకోబోతున్నారు. భారత మాజీ పురుష మాజీ క్రికెటర్లు, మహిళా క్రికెటర్లకు కూడా ఈ పెంచిన మొత్తం వర్తిస్తుంది.
‘మాజీ క్రికెటర్ల ఆర్థిక బాగోగులు చూసుకోవడం మా బాధ్యత. ప్లేయర్లు ఎప్పుడూ బోర్డుకి లైఫ్ లైన్ వంటి వాళ్లు. ఆట నుంచి తప్పుకున్న తర్వాత వారి సంక్షేమాన్ని చూసుకోవడం మా కర్తవ్యం. అంపైర్లు, ఎవ్వరూ గుర్తించని హీరోలు. అందుకే వారి సేవలకు కృతజ్ఞతగా వారి పెన్షన్‌ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం...’ అంటూ తెలిపాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...
‘మా మాజీ క్రికెటర్ల, ప్రస్తుత క్రికెటర్ల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యం. మాజీ క్రికెటర్ల పెన్షన్‌ని పెంచడం వారి పట్ల మేం ఏ విధంగా నడుచుకోబోతున్నామనేదానికి సూచిక. 900 మంది మాజీ పురుష, మహిళా క్రికెటర్లతో పాటు అంపైర్లకు కూడా కలిసి 75 శాతం నుంచి 100 శాతం పెన్షన్‌ని పెంచుతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాం...’ అంటూ తెలిపాడు బీసీసీఐ మాజీ సెక్రటరీ జై షా...