
తొలి టెస్టులో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ముప్పు ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఆచితూడి అడుగులు వేస్తున్నది. వాండరర్స్ లో భారత్ పై గెలవని రికార్డును చెరిపేసే దిశగా పయనిస్తున్నది. వాండరర్స్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆతిథ్య జట్టు.. ఆపై లక్ష్యం దిశగా సాగుతున్నది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.... 40 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. టీమిండియా.. సఫారీల ముందు నిలిపిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆ జట్టు మరో 122 పరగులు సాధించాలి. చేతిలో మరో 8 వికెట్లు, రెండ్రోజుల ఆట మిగిలుండటంతో సఫారీలు విజయంపై ధీమాగా ఉన్నారు. ఈ సిరీస్ లో సెంచూరియన్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
240 పరుగుల విజయలక్ష్యంతో ఛేదన ప్రారంభించిన సఫారీలకు టోర్నీలో తొలిసారి శుభారంభం దక్కింది. ఈ సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న ఆ జట్టు ఓపెనర్ మార్క్రమ్ (38 బంతుల్లో 31) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు అతడు మెరుపులు మెరిపించాడు. మరో ఓపెనర్, సౌతాఫ్రికా సారథి డీన్ ఎల్గర్ ( 121 బంతుల్లో 46 బ్యాటింగ్) తో కలిసి తొలి వికెట్ కు ఈ ఇద్దరూ 47 పరుగులు జోడించారు.
కాగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టును కుప్పకూల్చిన టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న మార్క్రమ్ ను ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్ (44 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించాడు. ఎల్గర్ తో కలిసి అతడు రెండో వికెట్ కు 46 పరుగులు జోడించాడు.
తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసి జోరుమీదున్న పీటర్సన్ మరో అర్థ శతకం దిశగా సాగినా.. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అతడిని పెవిలియన్ కు పంపాడు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా ఎల్గర్ మాత్రం నిలకడగా ఆడాడు. డసెన్ (37 బంతుల్లో 11) తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. భారత బౌలర్లలో ఠాకూర్, అశ్విన్ కు తలో వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా విజయాన్ని ఆపడం కష్టమే.. వాండరర్స్ లో ఇంతవరకు భారత్ చేతిలో గెలవని రికార్డును సఫారీలు రేపు అన్నీ కలిసొస్తే తుడిచేయనున్నారు. ఇక ఇక్కడ ఆడిన ఏ టెస్టులోనూ ఓడిపోని రికార్డు ఉన్న టీమిండియాకు భంగపాటు తప్పేలా లేదు.
అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్సులో 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 85-2తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాను వెటరన్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా (53), అజింక్యా రహానే (58) ఆదుకున్నారు. వీళ్ల క్లాస్ బ్యాటింగ్ కు తోడు ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి (84 బంతుల్లో 40 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (24 బంతుల్లో 28) కూడా మెరిశారు. రిషభ్ పంత్ డకౌట్ అయ్యాడు.