పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం.. ఆసియా కప్‌ను అందుకున్న భారత్

Published : Nov 14, 2026, 07:20 PM IST
IND vs PAK U19 Final

సారాంశం

IND vs PAK U19 Final: భారత్, పాకిస్థాన్ అండర్-19 జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులకు అసలైన ఉత్కంఠను పంచింది. చివరి ఓవర్ వరకు సాగిన పోరులో భారత యువ ఆటగాళ్లు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించారు.

పాకిస్థాన్‌ భారీ స్కోరు.. ఉస్మాన్ ఖాన్ సెంచరీ

టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టుకు ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతను 111 బంతుల్లో 107 పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు హయామ్ ఖాన్ 21 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అబ్దుల్ ఖాదిర్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 60 బంతుల్లో 63 పరుగులు చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా సాగింది. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో కావ్య పటేల్ మెరుపులు

పాకిస్థాన్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కావ్య పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లలో 68 పరుగులిచ్చి ప్రత్యర్థి కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు సాధించి తన సత్తా చాటాడు. అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లలో భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ స్కోరు 350 పరుగుల మార్కును దాటకుండా నిలువరించగలిగారు.

లక్ష్య ఛేదనలో ల‌క్ష్య రాజేశ్, సెహ్వాగ్ కీలక ఇన్నింగ్స్

338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రైచందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ మంచి ఆరంభాన్ని అందించారు. లక్ష్య రాజేశ్ 101 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు ఆర్యవీర్ సెహ్వాగ్ 61 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. వీరిద్దరూ క్రీజులో నిలిచి జట్టు విజయానికి పునాది వేశారు. అనంతరం వికే వినీత్ 24, అర్జున్ రాజ్‌పుత్ 16 పరుగులు చేశారు. అయితే కీలక సమయంలో వరుసగా వికెట్లు పడటంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది.

మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా పోరాటం

భారత్ విజయానికి చేరువవుతున్న సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది. యశ్వర్ధన్ చౌహాన్ 9, అన్వయ్ ద్రవిడ్ 19, ఆర్యన్ సావసాని 9 పరుగులకే వెనుదిరిగారు. దీంతో మ్యాచ్ పాకిస్థాన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపించింది. ఈ దశలో మనల్ చౌహాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 32 బంతుల్లో 47 పరుగులు చేసి భారత జట్టులో ఆశలు రేకెత్తించాడు. మరోవైపు మోహిత్ ఉల్వా అసాధారణ బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 26 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చిగురుపాటి వెంకట 8 బంతుల్లో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

చివరి వరకు ఉత్కంఠ.. ఒక్క వికెట్‌తో భారత్ విజయం

చివరి వికెట్లు మిగిలి ఉండటంతో మ్యాచ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకుని పోరాడారు. చివరకు 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్‌పై ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్ష్య ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడిన లక్ష్య రాజేశ్, సెహ్వాగ్‌తో పాటు చివరి దశలో పోరాడిన మోహిత్ ఉల్వా భారత విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ విజయంతో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటిన భారత యువ జట్టు అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India vs New Zealand: టీమిండియా కొంపముంచిన మూడు ప్రధాన కారణాలు ఇవే
IND vs NZ ODI: చెల‌రేగిన న్యూజిలాండ్ బౌల‌ర్లు.. టీమిండియా ఘోర ప‌రాజ‌యం