
లార్డ్స్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టీమిండియా లండన్ వేదికగా.. ఇంగ్లాండ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతుండగా.. ఈ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ, జేమ్స్ అండర్సన్ ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం క్రీజులో ఉన్నంతసేపు విరాట్ కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడేస్తూ కనిపించాడు. దాంతో.. అతని ఏకాగ్రతని దెబ్బతీసేందుకు అండర్సన్ తొలుత నోరు జారగా.. విరాట్ కోహ్లీ కూడా అదేరీతిలో బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా.. ఫీల్డ్ అంపైర్ మౌనంగా చూస్తుండిపోయాడు.
ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో మొదటి బంతినే విరాట్ కోహ్లీ బౌండరీకి తరలించాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా అండర్సన్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీని విరాట్ కోహ్లీ చూడచక్కని డ్రైవ్‌తో ఫోర్‌గా మలిచాడు. దాంతో.. జేమ్స్ అండర్సన్ నోరు జారగా.. ఆ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళ్లిన కోహ్లీ.. అండర్సన్‌కి ఘాటుగా రిప్లై ఇచ్చాడు. కానీ.. ఆ తర్వాత రాబిన్సన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన కోహ్లీ.. శామ్ కరన్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడి వికెట్ చేజార్చుకున్నాడు.
కాగా.. తాజాగా ఈ విషయంపై స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. అలాంటి భాష మంచిది కాదన్నారు. దాని వల్ల సమస్యల్లో పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఆయన కోహ్లీని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి దీనిపై కోహ్లీ , బీసీసీఐ ఎలా స్పందిస్తారో చూడాలి.