INDvsENG 2nd Test: 30 ఓవర్లు, 50 పరుగులు... జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు...

By Chinthakindhi RamuFirst Published Aug 15, 2021, 8:27 PM IST
Highlights

179 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... మూడేళ్ల తర్వాత ఈ ఇద్దరి మధ్యా 50+ భాగస్వామ్యం...

రెండో టెస్టులో భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... తమదైన ఆటతీరుతో ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం 78 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు...

కొన్నాళ్లుగా పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే క్రీజులో నిలదొక్కుకుపోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో... రెండో సెషన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లేమీ దక్కలేదు. దాదాపు 30 ఓవర్ల పాటు (179 బంతులు) బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ 50 పరుగుల భాగస్వామ్యం మాత్రమే నమోదుచేయడం విశేషం. 

35 బంతుల తర్వాత సింగిల్ తీసి ఖాతా తెరిచిన ఛతేశ్వర్ పూజారా 148 బంతుల్లో 2 ఫోర్లతో 29 పరుగులు చేయగా... అజింకా రహానే 74 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.  2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగో వికెట్‌కి 87 పరుగులు జోడించిన ఈ ఇద్దరూ... మూడేళ్ల తర్వాత తొలిసారిగా 50+ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.

ఈ మధ్యకాలంలో ఆసీస్ పర్యటనలో సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి 246 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా... ఆ తర్వాత అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం ఇదే.

click me!