
Rishabh Pant celebration: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ బౌలింగ్ ను దంచికొట్టాడు. సూపర్ సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. తొలి రోజు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. రెండో రోజు మరింత దూకుడుగా ఆడుతూ సెంచరీని పూర్తి చేశారు. తన టెస్టు కెరీర్ లో రిషబ్ పంత్ కు ఇది ఏడో సెంచరీ కావడం విశేషం.
తొలి రోజు పంత్ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో రోజు పంత్ దూకుడుగా ఆడుతూ సెంచరీని పూర్తి చేశాడు. 99 పరుగులతో ఉన్న సమయంలో సిక్సర్ తో రిషబ్ పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 71.92 స్ట్రైక్ రేటుతో తన సెంచరీని సాధించాడు. మొత్తంగా 134 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
తన సెంచరీ పూర్తయిన తర్వాత రిషబ్ పంత్ తనదైన స్టైల్లో సంబరాలు చేసుకున్నారు. సోమర్‌సాల్ట్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తన సెంచరీ చేసుకున్న సమయంలో రిషబ్ పత్ ఇలా చేయడం ఇదివరకు కూడా చూశాం. ఇప్పుడు మళ్లీ రిషబ్ పంత్ సోమర్‌సాల్ట్ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ సెంచరీ సంబరాలు అక్కడి క్రికెట్ లవర్స్ కు మరింత ఉత్సాహాన్ని పంచాయి.
రిషబ్ పంత్ తన సెంచరీకి ముందు 'రోలీపోలి' అనే వినూత్న షాట్ ఆడాడు. ఇది షోయబ్ బషీర్ వేసిన లెగ్‌స్టంప్ బంతిని లెగ్ స్లిప్ మీదుగా ఫైన్ లెగ్‌కు పంపిస్తూ, నేలపై పడిపోయి తిరుగుతూ చేసిన స్టైల్ షాట్. ఈ దృశ్యం అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఇషా గుహా ఈ షాట్‌ను “It’s a roly-poly shot!” అంటూ పేర్కొన్నారు.
గత సంవత్సరం ఆస్ట్రేలియాలో రిషబ్ పంత్ ఔటైన తీరుపై 'స్టూపిడ్, స్టూపిడ్, స్టూపిడ్' అంటూ విమర్శించిన సునీల్ గవాస్కర్ ఇప్పుడు ప్రశంసలు కురిపించాడు. లీడ్స్‌లో పంత్ సెంచరీ చేసిన తర్వాత 'సూపర్భ్, సూపర్భ్, సూపర్భ్' అంటూ ప్రశంసలు కురిపించారు.
పంత్ తనదైన శైలిలో స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌లో అతనికిది మూడో టెస్టు సెంచరీ కావడం విశేషం. తన సెంచరీ తర్వాత పంత్ మైదానంలో సోమర్‌సాల్ట్ చేస్తూ స్టైల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సోనీ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పంత్ సహజసిద్ధమైన శైలిని ప్రశంసించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే క్రీజు వదిలి ముందుకు వచ్చి ఆడటం వల్ల అతనికి స్వేచ్ఛ లభిస్తుందని తెలిపాడు.
"పంత్ ఆడే పద్ధతి అదే అనిపిస్తుంది. అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, రెండో లేదా మూడో బంతికి అతను తరచుగా క్రీజు వదిలి ముందుకు వచ్చి బౌండరీ కొడతాడు. అది అతనికి స్వేచ్ఛను ఇస్తుంది. ఆ తర్వాత అతను తనకు కావలసిన విధంగా ఆడటానికి వీలు కల్పిస్తుంది" అని గవాస్కర్ అన్నారు.
భారత వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన రికార్డును పంత్ ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నాడు. లీడ్స్ లో సాధించిన సెంచరీ తన టెస్టు కెరీర్ లో 7వ సెంచరీ. వికెట్ కీపర్‌గా ఈ ఫార్మాట్‌లో ఆరు సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కూడా పంత్ బద్దలు కొట్టాడు. వృద్ధిమాన్ సాహా మూడు టెస్ట్ సెంచరీలతో మూడవ స్థానంలో ఉన్నాడు.
పంత్ మొత్తం మీద అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ఏబీ డివిలియర్స్, కుమార సంగక్కరలను సమం చేశాడు. వీరు వికెట్ కీపర్ గా ఏడు టెస్ట్ సెంచరీలు చేశారు. టెస్ట్‌లలో వికెట్ కీపర్ గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ 12 సెంచరీలతో టాప్ లో ఉన్నారు.
కాగా, ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులకు ఆటౌల్ అయింది. భారత బ్యాటర్లలో జైస్వాల్ 101, కేఎల్ రాహుల్ 42, గిల్ 147, పంత్ 134 పరుగులు చేశారు.