Team India: వైజాగ్ టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీసుకున్నాడు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు ప్లేయర్ల మధ్య 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' రగడ హాట్ టాపిక్ గా మారింది.. !
Jasprit Bumrah - Yashaswi Jaiswal: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను భారత్ చిత్తు చేసింది. రెండో టెస్టును గెలిచిన భారత్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వైజాగ్ టెస్టు గెలుపుతో మళ్లీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది టీమిండియా. భారత్ దూకుడు, ఉత్సాహాన్ని తర్వాతి టెస్టులో ఇంగ్లాండ్ అడ్డుకోవడం కష్టమనే చెప్పాలి. తొలి టెస్టులో ఓటమి తర్వాత భారత జట్టు అద్భుతంగా పునరాగమనంలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, సీనియర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ సహా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం కీలక పాత్ర పోషించింది.
ఇంగ్లాండ్ తో జరిగిన వైజాగ్ టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు మొత్తంగా రెండో టెస్టులో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. అయితే విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు టీమిండియా గెలుపులో కీలకమైన మరో ప్లేయర్ యశస్వి జైస్వాల్. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి భారత్ కు మంచి అధిక్యం లభించేలా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన 396 పరుగులలో జైస్వాల్ ఒక్కడే 209 పరుగులు కొట్టాడు. అంటే మిగతా ప్లేయర్లు అందరూ కలిపి జైస్వాల్ కొట్టినన్ని పరుగులు కూడా చేయలేదు.
బుమ్రా మాయజాలం.. అశ్విన్ పటాస్.. గిల్-జైస్వాల్ తుఫాను !
యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులతో భారత జట్టు విజయానికి పునాది వేశాడు. టీమిండియా చేసిన 396 పరుగులలో యశస్వి జైస్వాల్ 209 పరుగులను తొలగిస్తే, మిగిలిన బ్యాట్స్‌మెన్ 187 పరుగులు మాత్రమే చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఇతర బ్యాట్స్‌మెన్‌లా ఫ్లాప్ అయితే, భారత్ ఓటమి దాదాపు ఖాయం. యశస్వి జైస్వాల్ 290 బంతుల్లో 19 ఫోర్లు, ఏడు సిక్సర్లతో టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. టీమిండియా విజయంలో హీరోగా ఉన్నాడు. కానీ, రెండో ఇన్నింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ముందు జైస్వాల్ డబుల్ సెంచరీ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ నేపథ్యంలోనే భారత్ గెలుపులో నిజమైన హీరో బుమ్రా కొంతమంది క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేయగా, మరికొంత మంది కాదు గెలుపుకు పునాది వేసిన యశస్వి జైస్వాల్ టీమిండియా గెలుపులో నిజమైన హీరో అనీ, అతనే నిజమైన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్ల అభిమానుల కామెంట్స్ తో మరో హాట్ టాపిక్ రచ్చ చేస్తోది.. !