మహి భాయ్ మద్దతు ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు.. ఇదే నా టాప్ ఇన్నింగ్స్

By telugu teamFirst Published Sep 20, 2021, 3:26 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడంటే దేనికోసమూ ఎక్కువగా భయపడాల్సిన పనిలేదని, ఆయన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. ఐపీఎల్ రెండో దశ ప్రారంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌‌పై సాధించిన పరుగులే తన టాప్ ఇన్సింగ్స్ అని వివరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన గైక్వాడ్ ధోనిపై ప్రశంసలు కురిపించారు.
 

ఐపీఎస్ సీజన్ ప్రారంభమవడంతో క్రికెట్ అభిమానులందరూ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఐపీఎల్ రెండో దశ ప్రారంభమ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. ఎంఎస్ ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్నది. ఈ తరుణంలో ముంబయి ఇండియాతో సీఎస్‌కే తలపడుతున్న ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే చతికిలపడింది. వెనువెంటనే కీలక బ్యాట్‌మెన్లు ధోని సహా పెవిలియన్‌కు చేరారు. కేవలం 24 పరుగుల్లోనే నలుగురు వెనుదిరిగారు. ఈ తరుణంలో ఫ్యాన్స్ నిరాశలోకి కూరుకుపోతుండగా రుతురాజ్ గైక్వాడ్ వారి ఆశలను సజీవంగా నిలిపారు. తన అద్భుత సంయమనంతో క్రీజులో నిలదొక్కుకుని జట్టుకు చెప్పుకోదగ్గ పరుగులను సాధించి పెట్టాడు. తాజాగా ఆయన తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ధోనిపై కామెంట్ చేశారు.

మహి భాయ్ మద్దతు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చునని సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. ‘యెస్.. నేను ఇది వరకు ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమమైనది’ అని అన్నారు. ఆరంభంలోనే సీఎస్‌కే వికెట్లు కోల్పోవడం, సీనియర్లు వెనుదిరగడం చాలా ఒత్తిడి పెంచుతుందని తెలిపారు. కానీ, ఆ ఒత్తిడిని కాసేపు తాను పక్కనపెట్టినట్టు వివరించారు. దాని ఫలితంగానే టీమ్ స్కోర్ 150 దాటిందని చెప్పారు. అంతేకాదు, మహి భాయ్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించేయవచ్చునని తెలిపారు.

అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి మాట్లాడారు. మహిభాయ్ ఉంటే భయపడాల్సిన పనిలేదని అన్నారు. నిజానికి మ్యాచ్ ఆరంభంలో బాల్ బాగా స్వింగ్ అయిందని, అయినా తట్టుకున్నట్టు వివరించారు. ముఖ్యంగా స్పిన్నర్‌ల బౌలింగ్‌లో రాణించాలని అనుకున్నారని తెలిపారు. అయితే జడేజా రావడంతో తన ప్లాన్ చక్కగా వర్కవుట్ అయిందని తెలిపారు.

ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ ప్రాంభంలోనే డుప్లెసిస్, రైనా, మొయిన్ అలీలు వేగంగా వెనుదిరిగినా, ఓపెనర్‌గా దిగిన రుతురాజ్ నిలకడగా రాణించాడు. జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 58 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 88 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. టీమ్ సాధించిన మొత్తం 156 పరుగుల్లో ఆయనవే సగానికి ఎక్కువగా ఉన్నాయి. 

click me!