‘పొలార్డ్ తప్పు చేశాడు.. బుమ్రాను సరిగ్గా వినియోగిస్తే చెన్నై 80 రన్‌లకే కుప్పకూలేది’

By telugu teamFirst Published Sep 20, 2021, 2:48 PM IST
Highlights

ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ స్పందించారు. ముంబయి ఓటమికి తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్ వ్యూహాలూ తోడయ్యాయని అన్నారు. సీఎస్‌కే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న సందర్భంలోనే స్టార్ బౌలర్ బుమ్రాతో మరో రెండు మూడు ఓవర్లు వేయించి ఉండాల్సిందని తెలిపారు. అలా చేస్తే సీఎస్‌కే 80 పరుగులకే ఆలౌట్ అయ్యేదని చెప్పారు.

ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభ మ్యాచ్ ముంబై, చెన్నై జట్లకు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ తనదైన శైలిలో స్పందించారు. ముంబయి ఆటపై పెదవి విరిచాడు. తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ తప్పుడు వ్యూహాలను అనుసరించాడని అన్నాడు. ముంబయి బౌలర్లు ఇచ్చిన అదిరిపోయే ఆరంభాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకోకుండా తప్పిదాలు చేశాడని విశ్లేషించాడు. ఒకవేళ బుమ్రాను సరిగ్గా వినియోగించుకుంటే సీఎస్‌కే 80 పరుగులకే కుప్పకూలేదని అన్నాడు.

ఐపీఎల్ రెండో దశ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఆరంభంలోనే చెన్నై కీలక బ్యాట్‌మెన్స్‌ను పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను దాదాపు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కానీ, సీఎస్‌కే తిరిగి నిలదొక్కుకుని 156 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ లక్ష్య ఛేదనలో చతికిలపడింది. 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హర్దిక్ పాండ్యాలు లేకుండానే ముంబయి ఇండియన్ బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్‌పై పీటర్సన్ మాట్లాడుతూ, ముంబయి ఇండియన్స్ మెరుగ్గా ఆటను ప్రారంభించిందని అన్నారు. మ్యాచ్ ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరమైనప్పటికీ ఆ ఒత్తిడిని జయించి మెరుగైన ఆట కనబరిచింది. బౌలర్లు అద్భుతంగా రాణించారు. పవర్ ప్లే ముగిసేటప్పటికే సీఎస్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిందని చెప్పారు. ఇక్కడే పొలార్డ్ తప్పుడు వ్యూహాన్ని అనుసరించాడని విశ్లేషించారు. ఒత్తిడిలో పడిపోయిన చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి పెవిలియన్ పంపడానికి బుమ్రాకు బంతి ఇవ్వాల్సిందని అన్నారు. బుమ్రా‌తో రెండు లేదా మూడు ఓవర్లు అయినా వేయిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవని చెప్పారు.

అటువంటి కీలక సందర్భంలో జస్‌ప్రీత్ బుమ్రాతో బౌలింగ్ వేయిస్తే సీఎస్‌కే మరో 40 లేదా 50 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయి ఉండేదని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయి ఉండేదని చెప్పారు. ఎందుకంటే ఒత్తిడిలో ఉన్న బ్యాట్‌మెట్‌ను ఔట్ చేయడానికి స్టార్ బౌలర్లను వినియోగించుకోవడం కొత్త వ్యూహమేమీ కాదని అన్నారు.

మ్యాచ్ ఆరంభంలో ఆరు ఓవర్ల వరకు మిల్నే, బౌల్ట్‌తోనే బౌలింగ్ వేయించిన పొలాడర్డ్ తర్వాతి ఓవర్‌ను బుమ్రాకు ఇచ్చాడు. మళ్లీ 14వ ఓవర్ దాకా ఆయన చేతికి బంతినివ్వలేదు. కీలక బ్యాట్‌మెన్లు వెనుదిరిగిన తర్వాత ఆయనతో మరో రెండు ఓవర్‌లైనా వేయించి ఉంటే ఆ ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన బ్యాట్‌మెన్‌లు వెనుదిరిగి ఉండేవారు. 14వ ఓవర్ తర్వాత మళ్లీ 16వ ఓవర్‌ ఇచ్చాడు. కానీ, అప్పటికే రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో నిలదొక్కుకుని ఉన్నాడు. ఫలితంగా ఆ ఓవర్‌లు ఆశించిన ఫలితాలనివ్వలేదు. 

సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 88 పరుగులు అజేయంగా చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.

click me!