ICC World Cup Final 2023 : IND VS AUS ఫైనల్లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే... కొట్టాడో ఇండియా హిట్టే...

By Arun Kumar PFirst Published Nov 19, 2023, 11:09 AM IST
Highlights

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టాడంటే రికార్డుల మోత మోగాల్సిందే.  ఇలా ఇప్పేటికే అనేక రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీని నేడు భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్లో మరికొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. 

అహ్మదాబాద్ : ప్రపంచ క్రికెట్ లో ఉత్తమ ఆటగాళ్లలోనే అత్యుత్తమమైనవాడు విరాట్ కోహ్లీ. అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తూ... రికార్డుల మోత మోగిస్తూ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సంపాదించుకున్నాడు. క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ స్పూర్తితో క్రికెటర్ గా మారానంటూనే అతడి రికార్డులను ఒక్కోటిగా బద్దలుగొడుతున్నాడు కింగ్ కోహ్లీ. ఇటీవల సచిన్ అరుదైన 49 సెంచరీల రికార్డును అధిగమించి 50వ సెంచరీ పూర్తిచేసుకుని గురువును మించిన శిష్యుడినని నిరూపించుకున్నాడు. అలాగే స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ 2023 లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల రికార్డ్ కోహ్లీ పేరిట నమోదయ్యింది. ఇలా ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు, రికార్డులు సాధించిన కోహ్లీని నేడు జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్లో మరిన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. 

ప్రపంచంలోనే  అతిపెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ లో రోహిత్ సేన ఓటమన్నదే ఎరగదు... ఇదే విజయపరంపరను కొనసాగిస్తూ ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. ఇలా టీమిండియా గెలిస్తే కోహ్లీ పేరిట అరుదైన రికార్డ్ నమోదు కానుంది.  

2011 వరల్డ్ కప్ లో మహేంద్ సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా విజేతగా నిలిచింది... ఆ జట్టులో కోహ్లీ కూడా సభ్యుడే. ఇప్పుడు మళ్లీ 2023 ప్రపంచ కప్ లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచింది. ఇందులోనూ కోహ్లీ సభ్యుడిగా వున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ గెలిస్తే రెండు ప్రపంచ కప్ లు గెలిచిన జట్టులో ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.  

Read More  IND VS AUS : ఆస్ట్రేలియాకు అదే బలం... తప్పుచేసారో భారీ మూల్యం : రోహిత్ సేనకు యువరాజ్ హెచ్చరిక

ఇక ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ అదే ఆసిస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టే అవకాశాలున్నాయి. ఇవాళ్టి మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు చేస్తే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండోస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం పాంటింగ్ 1743 పరుగులతో రెండో స్థానంలో వుండగా కోహ్లీ 1741 పరుగులతో మూడోస్థానంలో నిలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట వుంది. అతడు 2,278 పరుగులతో టాప్ లో నిలిచాడు. 

ఇక ఇప్పటికే ఒకే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే 10 మ్యాచులు ఆడిన కోహ్లీ 711 పరుగులు సాధించాడు. 2003 వరల్డ్ కప్ లో సచిన్ అత్యధికంగా 673 పరుగులు చేసారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే ఒకే వరల్డ్ కప్ అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులతో పాటు మరెన్నో రికార్డులు నమోదు కానున్నాయి. 


 

click me!