230 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగి 34.5 ఓవర్లలో 129 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్... 100 పరుగుల తేడాతో భారత్‌కి భారీ విజయం! వరుసగా ఆరో విజయంతో సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచుల్లో ఛేదించి గెలిచిన టీమిండియా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి కూడా విజయాన్ని అందుకుంది. 230 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్, 34.5 ఓవర్లలో 129 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 100 పరుగుల తేడాతో భారత్‌కి భారీ విజయం దక్కింది.
మొదటి 6 మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, అధికారికంగా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. వరుసగా ఆరో విజయం అందుకున్న భారత జట్టు, సెమీ ఫైనల్‌కి దాదాపు అర్హత సాధించింది..
undefined
230 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ని జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి జో రూట్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జో రూట్ డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు క్లియర్‌గా కనిపించడంతో నిరాశ తప్పలేదు..
10 బంతులు ఆడిన బెన్ స్టోక్స్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తన రెండో ఓవర్ చివరి బంతికి బెన్ స్టోక్స్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ, మూడో ఓవర్ తొలి బంతికి జానీ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన బెయిర్‌స్టో, షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
23 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొయిన్ ఆలీ, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి ఆరో వికెట్‌కి 29 పరుగులు జోడించారు.
31 బంతుల్లో 15 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, మహ్మద్ షమీ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన క్రిస్ వోక్స్, జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 46 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
98 పరుగుల వద్ద 8 వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. డేవిడ్ విల్లే, అదిల్ రషీద్ కలిసి 9వ వికెట్‌కి 24 పరుగులు జోడించారు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అదిల్ రషీద్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.
మార్క్ వుడ్‌ని జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి తెరబడింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగుల స్కోరు చేయగలిగింది.. రోహిత్ శర్మ 87, సూర్యకుమార్ యాదవ్ 49, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేసి భారత జట్టుకి మంచి స్కోరు అందించారు..