India vs England: 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసిన టీమిండియా... 87 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 49 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొట్టమొదటిసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్ పెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగుల స్కోరు చేయగలిగింది.. రోహిత్ శర్మ 87, సూర్యకుమార్ యాదవ్ 49, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేసి భారత జట్టుకి మంచి స్కోరు అందించారు..
13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.
మొదటి 9 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి..
16 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్క్ వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి నాలుగో వికెట్‌కి 91 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, డేవిడ్ విల్లే బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కలిసి ఐదో వికెట్‌కి 33 పరుగులు జోడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, ఈ ఫీట్ సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ మాత్రమే రోహిత్ శర్మ కంటే ముందున్నారు..
2023లో వన్డేల్లో 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, 13 పరుగుల తేడాలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
13 బంతుల్లో 8 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మహ్మద్ షమీ 1 పరుగు చేసి అవుట్ కావడంతో 183 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. 46 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియా స్కోరుని 200+ మార్కు దాటించి అవుట్ అయ్యాడు..
హాఫ్ సెంచరీకి ముందు భారీ షాట్‌కి ప్రయత్నించిన సూర్య, డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. 25 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ కలిసి 9వ వికెట్‌కి 21 పరుగులు జోడించారు. బుమ్రా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ కాగా కుల్దీప్ యాదవ్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.