383 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 46.4 ఓవర్లలో 233 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్... 111 పరుగులతో మహ్మదుల్లా ఒంటరి పోరాటం..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సౌతాఫ్రికా నాలుగో విజయాన్ని అందుకుంది. ముంబైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో గెలిచింది సౌతాఫ్రికా. 383 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్, 46.4 ఓవర్లలో 233 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
తన్జీద్ హసన్ 12, లిటన్ దాస్ 22 పరుగులు చేయగా షకీబ్ అల్ హసన్ 1, ముస్తాఫిజుర్ రహీం 8 పరుగులు చేశారు. నజ్ముల్ హుస్సేన్ షాంటో డకౌట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ 11, నసుమ్ అహ్మద్ 19, హసన్ మహ్మద్ 15 పరుగులు చేసి అవుట్ కావడంతో 159 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్..
అయితే ఓ ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన మహ్మదుల్లా 11 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 111 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేశాడు. అయితే నెట్ రన్ రేట్ భారీగా పెరిగిపోవడం, అవతలి ఎండ్‌లో సరైన సహకారం లభించకపోవడంతో మహ్మదుల్లా ఒంటరి పోరాటం బంగ్లా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది..
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 11 పరుగులు చేసి అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ 3 వికెట్లు తీయగా మార్కో జాన్సెన్, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడా రెండేసి వికెట్లు తీశారు. కేశవ్ మహరాజ్‌కి ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. రీజా హెండ్రిక్స్ 12, వాన్ దేర్ దుస్సేన్ 1 పరుగు చేసి నిరాశపరిచినా అయిడిన్ మార్క్‌రమ్ 60, హెన్రీచ్ క్లాసిన్ 90 పరుగులు చేసి రాణించారు. 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో మూడో సెంచరీ బాదాడు..