ICC World cup 2023: భారీ లక్ష్యాన్ని ఊదేసిన పాకిస్తాన్.. వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయం..

345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించిన పాకిస్తాన్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా రెండో విజయం..

 

Google News Follow Us

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది పాకిస్తాన్.. బాబర్ ఆజమ్ మరోసారి నిరాశపరిచినా మహ్మద్ రిజ్వాన్ అజేయ సెంచరీతో మ్యాచ్‌ని ముగించాడు.

ఇమామ్ ఉల్ హక్ 12, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. ఈ దశలో అబ్దుల్లా షెఫీక్- మహ్మద్ రిజ్వాన్ కలిసి మూడో వికెట్‌కి 176 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేసిన అబ్దులా షెఫీక్, మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పాకిస్తాన్ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. పేలవ ఫామ్‌తో వరుసగా విఫలమవుతున్న ఫకార్ జమాన్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన అబ్దుల్లా షెఫీక్‌కి ఇది ఐదో వన్డే..

అబ్దుల్లా షెఫీక్ అవుటైన తర్వాత సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కలిసి నాలుగో వికెట్‌కి 95 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేసిన సౌద్ షకీల్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే పాకిస్తాన్ 33 బంతుల్లో 37 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది. 

121 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. ఇఫ్తికర్ అహ్మద్ 10 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. పథుమ్ నిశ్శంక 51, కుసాల్ మెండిస్ 122, సధీర సమరవిక్రమ 108 పరుగులు చేశారు. 30 ఓవర్లలోనే 230 పరుగులు చేసిన శ్రీలంక, ఆఖరి 20 ఓవర్లలో 119 పరుగులే చేయగలిగింది. ఇదే లంక ఓటమికి కారణమైంది.. 

బ్యాటింగ్‌లో అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్న శ్రీలంక, ఫీల్డింగ్‌లో క్యాచులు డ్రాప్ చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకి 428 పరుగుల భారీ స్కోరు ఇచ్చి, 102 పరుగుల తేడాతో ఓడిన శ్రీలంక, వరుసగా రెండో మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే ఓడింది. పాకిస్తాన్, తన తర్వాతి మ్యాచ్‌ని అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఆడనుంది. 

శ్రీలంక తన తర్వాతి మ్యాచ్‌‌ని అక్టోబర్ 16న లక్నోలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టుతో ఓడిన ఆస్ట్రేలియా, అక్టోబర్ 12న లక్నోలోనే సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడి, శ్రీలంకతో మ్యాచ్ ఆడుతుంది.