వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో బోణీ కొట్టిన ఇంగ్లాండ్.. 48.2 ఓవర్లలో 227 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. 76 పరుగులతో పోరాడిన లిటన్ దాస్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఇంగ్లాండ్. 365 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్, 48.2 ఓవర్లలో 227 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
మొదటి ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన లిట్టన్ దాస్, దూకుడుగా ఇన్నింగ్స్‌ని ఆరంభించాడు. అయితే రీస్ తోప్లే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. తన్జీద్ హసన్ 1 పరుగు చేయగా నజ్ముల్ హుస్సేన్ షాంటో గోల్డెన్ డకౌట్ అయ్యాడు..
9 బంతులు ఆడిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా రీస్ తోప్లే బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ కూడా 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో లిటన్ దాస్ దూకుడుగా ఆడాడు..
66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసిన లిటన్ దాస్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముస్తాఫికర్ రహీం 64 బంతుల్లో 4 ఫోర్లతో 51 పరుగులు చేయగా, తోహిద్ హృదయ్ 39 పరుగులు చేశాడు. మెహిదీ హసన్ 14, షోరిఫుల్ ఇస్లాం 12 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ తోప్లే 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఓ మెయిడిన్‌తో 4 వికెట్లు పడగొట్టాడు.క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా అదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్, మార్క్ వుడ్, సామ్ కుర్రాన్ తలా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ మలాన్ 140 పరుగులు చేయగా జానీ బెయిర్‌స్టో 52, జో రూట్ 82 పరుగులు చేశారు.