2023 వన్డే వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా... అభిమానులకు టీమిండియా మరో‘సారీ’! కెప్టెన్ మారినా కథ మారలేదు...

By Chinthakindhi Ramu  |  First Published Nov 19, 2023, 9:23 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం... భారీ సెంచరీతో మ్యాచ్‌ని వన్ సైడ్ చేసిన ట్రావిస్ హెడ్.. 


పదేళ్ల ఐసీసీ టైటిల్ కల, మరోసారి ఆఖరి ఆటలో చెదిరిపోయింది. అజేయంగా వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత జట్టును ఏ సెంటిమెంట్ కూడా కాపాడలేకపోయింది.  భారత జట్టు జిడ్డు బ్యాటింగ్, పేలవ ఫీల్డింగ్, పస లేని బౌలింగ్, పిచ్... అన్నింటికీ మించి బ్యాడ్ లక్ టీమిండియాని మరోసారి ముంచింది. కెప్టెన్ మారినా టీమిండియా కథ మాత్రం మారడం లేదు.. 

ఈసారి ఎలాగైనా మనవాళ్లు టైటిల్ గెలుస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కి మరోసారి... నిరాశే ఎదురైంది. భారత్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు, చాలా కఠినంగా కనిపించిన పిచ్... ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కి వచ్చేసరికి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్‌గా మారిపోయినట్టు కనిపించింది. డేవిడ్ వార్నర్ 7, మిచెల్ మార్ష్ 15, స్టీవ్ స్మిత్ 4 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ కావడంతో  47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..

Latest Videos

అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ కలిసి టీమిండియాకి అవకాశం ఇవ్వలేదు. ట్రావిస్ హెడ్ తన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీతో చెలరేగిపోయాడు. మార్నస్ లబుషేన్ తనదైన టెస్టు ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లకు ‘టెస్టు’ పెట్టాడు. ఈ ఇద్దరినీ అవుట్ చేసేందుకు భారత జట్టు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.. నాలుగో వికెట్‌కి 192 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ని సిరాజ్ అవుట్ చేసినా అప్పటికే ఆస్ట్రేలియా విజయానికి 2 పరుగులే కావాల్సిన స్థితికి చేరుకుంది.  58 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ లాంఛనాన్ని ముగించాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ... మరోసారి మెరుపు ఆరంభం అందించినా భారీ స్కోరుగా మలచలేకపోయాడు..

63 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ కావడంతో మ్యాచ్ టర్న్ తీసుకుంది. 107 బంతులు ఆడిన కెఎల్ రాహుల్ ఒకే ఒక్క బౌండరీతో 66 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ మెప్పించలేకపోయారు. 
 

click me!