ఫైనల్‌లో ఆస్ట్రేలియా తొండాట... డీఆర్‌ఎస్ రివ్యూలు వృథా కాకుండా స్టంపౌట్ అప్పీలు చేస్తూ...

By Chinthakindhi Ramu  |  First Published Nov 19, 2023, 6:24 PM IST

ICC World cup 2023 Final: డీఆర్‌ఎస్ వాడేందుకు ఆస్ట్రేలియా అతి తెలివి... క్యాచ్ అప్పీల్ చేయకుండా అనవసరంగా స్టంపౌట్ కోసం అప్పీల్ చేస్తూ... 


ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్... గెలవడం కోసం ఏం చేసినా తప్పు లేదు. ఆస్ట్రేలియా ఈ సూత్రాన్ని బాగా నమ్ముతుంది. గెలవడం కోసం ఎంతకైనా తెగించే ఆస్ట్రేలియా, అవసరమైతే రూల్స్‌ని అతిక్రమించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఈ ఎత్తుగడ వేస్తోంది..

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. స్లో పిచ్‌పై ఫైనల్ ఫోబియా కారణంగా భారత బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. రోహిత్ శర్మ 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 47 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 4 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ 106 బంతులు ఆడితే అందులో ఒకే ఒక్క ఫోర్ ఉంది...

Latest Videos

డీఆర్‌ఎస్ వాడేందుకు ఆస్ట్రేలియా అతి తెలివిగా వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. క్యాచ్ కోసం అప్పీల్ చేసి, అంపైర్ నాటౌట్‌గా ఇస్తే... డీఆర్‌ఎస్ కోరుకోవడం కామన్. అయితే టీవీ రిప్లైలో నాటౌట్‌గా తేలితే ఓ రివ్యూ కోల్పోవాల్సి ఉంటుంది..

హజల్‌వుడ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ కోసం ఇలాగే డీఆర్‌ఎస్ తీసుకుని, ఓ రివ్యూ వేస్ట్ చేసింది ఆస్ట్రేలియా. అయితే ఆ తర్వాతి బంతికే జడ్డూ అవుట్ అయ్యాడు. అయితే దీనికి ముందు, దీని తర్వాత కూడా క్యాచ్ అవుట్ అనుమానం వచ్చిన వెంటనే అప్పీల్ చేయకుండా, స్టంప్స్ కొట్టి రివ్యూ కోరుకుంది ఆస్ట్రేలియా..

స్టంపౌట్ కోసం అప్పీల్ చేస్తే, ఫీల్డ్ అంపైర్ కచ్ఛితంగా థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేస్తారు. దీంతో థర్డ్ అంపైర్ కచ్ఛితంగా స్టంపౌట్ కంటే ముందు క్యాచ్ అవుట్, ఎల్బీడబ్ల్యూ అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. దీంతో డీఆర్‌ఎస్ రివ్యూ కూడా కోల్పోయే ప్రమాదం ఉండదు. ఇలా ఒకటికి రెండు సార్లు డీఆర్‌ఎస్‌ని తెలివిగా వాడింది ఆస్ట్రేలియా..  ఇది రూల్స్‌ని అతిక్రమించడం కాదు కానీ, క్రికెట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమే..

click me!