ఇంగ్లీష్ జట్టు ఇజ్జత్ పాయె... ప్రపంచకప్ ఆడిన ప్రతి టీం చేతిలో ఓడిన ఏకైక జట్టిదే..! 

By Arun Kumar P  |  First Published Oct 16, 2023, 11:21 AM IST

భారతదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీలో పసికూన అప్ఘానిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసింది ఇంగ్లాండ్ జట్టు. ఈ ఓటమి ద్వారా ప్రపంచ కప్ చరిత్రలోనే చెత్త రికార్డును ఇంగ్లాండ్ మూటగట్టుకుంది. 


న్యూడిల్లి : ఇంగ్లాండ్... క్రికెట్ కు పుట్టినిల్లు. ఆ దేశ జాతీయ క్రీడ కూడా క్రికెటే. ఇలా ఇంగ్లాండ్ సంస్కృతిలో క్రికెట్ ఆట మిలితమై వుంది. తాము ఆడటమే కాదు పాలించిన దేశాలకు క్రికెట్ ను పరిచయం చేసిన ఘనత గత ఇంగ్లాండ్ పాలకులది. అలాంటిది ఇప్పుడు తాము బానిసలుగా చేసుకుని పాలించిన దేశాలు క్రికెట్ లో దూసుకుపోతుంటే ఇంగ్లీష్ జట్టు మాత్రం పసికూనల చేతిలో ఓడిపోతూ ఇజ్జత్ తీసుకుంటోంది. ఇలా తాజాగా భారత్ లో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 లోనూ ఇంగ్లాండ్ జట్టు దారుణంగా ఆడుతోంది. తాజాగా పసికూన అప్ఘానిస్థాన్ చేతిలో చిత్తయి ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ టీం. 

ఒక్కోసారి చాలా పటిష్టంగా వున్నట్లు కనిపిస్తుంది... మరోసారి పసికూనల చేతిలో ఓడిపోతుంది ఇంగ్లాండ్ జట్టు. ఇలాగే భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో నిలకడలేమి ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ తో తలపడ్డ ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడి 137 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇంతలో ఏమయ్యిందో తెలీదు నిన్న(ఆదివారం) పసికూన అప్ఘాన్ చేతిలో ఓటమిపాలయ్యింది. ఈ ఓటమి ద్వారా వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక దేశాల చేతిలో ఓటమిపాలైన ఏకైక జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. 

Latest Videos

undefined

1975 నుండి 2023 వరల్డ్ కప్ వరకు ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ఆడే 11 దేశాల చేతిలో ఓటమిని చవిచూసింది. మొదట 1975 లో ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఈ ఓటముల పరంపర నిన్నటి అప్ఘాన్ మ్యాచ్ వరకు కొనసాగింది. 1979 లో వెస్టిండిస్,1983, 1987 వరల్డ్ కప్స్ లో భారత్, పాక్,న్యూజిల్యాండ్ చేతిలో ఓడింది ఇంగ్లాండ్. ఇక 1992 లో పసికూన జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. 1996 లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతిలో ఓడింది. 2011 ప్రపంచ కప్ లో అయితే ఐర్లాండ్ టీం చేతిలో ఓటమిని చవిచూసింది ఇంగ్లాండ్ టీం. 2015 లో బంగ్లాదేశ్, 2023లో అప్ఘాన్ చేతిలో ఓడింది. ఇలా అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రతి జట్టు చేతిలో ఇంగ్లాండ్ ఓడిందన్నమాట. 

Read More  ICC World Cup 2023 : బంతితో మాట్లాడే మాయగాడు మన పాండ్యా... చెవిలో చెప్పినట్లే చేసిందిగా..!

ఘనమైన క్రికెట్ చరిత్ర కలిగిన ఇంగ్లాండ్ కు ఆనాటినుండే వన్డే వరల్డ్ కప్ అచ్చిరానట్లుంది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత గత ప్రపంచ కప్ 2019 లో జగజ్జేతగా నిలిచింది. అయితే గతేడాది మెగాటోర్నీ ఆటతీరునే ఈసారి కనబరుస్తుందని ఆశించిన ఇంగ్లీష్ అభిమానులకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో ఓడింది... అందులోనూ ఓ మ్యాచ్ లో అప్ఘాన్ చేతిలో ఓడిపోవడం ఇంగ్లాండ్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

ఆదివారం న్యూడిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లాండ్-అప్ఘాన్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకుంటుండగా అప్ఘాన్ బౌలర్లు మాయ చేసారు. కేవలం 40.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసారు. ఇలా 215 పరుగులకే పరిమితం చేసి 69 రన్స్ తేడాతో అప్ఘాన్ ఘనవిజయం సాధించింది. 

click me!