పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్ 2023 లో చెత్త ప్రదర్శన కనబర్చడానికి భారత్ లో పరిస్థితులే కారణమని ఆ జట్టు కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : భారత్ లో జరుగుతున్న ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోవడాన్నే పాకిస్థాన్ అభిమానులు తట్టుకోలేకపోయారు. అలాంటిది పసికూన అప్ఘానిస్థాన్ కూడా పాక్ ను ఓడించడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మాత్రమే పాక్ గెలిచింది... మిగతా నాలుగు ఓడిపోయింది. ఇలా వరుస ఓటములతో సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. చాలాకాలం తర్వాత దాయాది దేశంలో అడుగుపెట్టి పాక్ ఆటగాళ్లు ఖాళీచేతులతో స్వదేశానికి వెళ్లడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో తమ జట్టు ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు పాక్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్.
చాలాకాలంగా భారత్ లో క్రికెట్ ఆడకపోవడమే ప్రపంచ కప్ 2023 లో పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితికి కారణమని కోచ్ బ్రాడ్‌బర్న్ పేర్కొన్నారు. భారత్ లో ప్రతీ మైదానం... పరిస్థితులు పాక్ ఆటగాళ్లకు కొత్తేనని అన్నారు. ఆడుతున్న వేదికలపై అవగాహన లేకపోవడంతో పాక్ ఆటగాళ్ళు ఇబ్బంది పడుతున్నారని... ఎంత ప్రాక్టీస్ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. టోర్నీ ఆరంభంలో బాగానే ఆడినా భారత్ తో మ్యాచ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఆ ఓటమి తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయని... ఇప్పుడు ఏమాత్రం కోలుకోలేని పరిస్థితిలో వున్నామని పాక్ కోచ్ పేర్కొన్నారు.
undefined
ఆడే ప్రతి మ్యాచ్ గెలవాలని ఏ జట్టయినా కోరుకుంటుంది... పాక్ కూడా అదే కోరుకుని పూర్తిస్థాయిలో సన్నద్దతతో బరిలోకి దిగుతోందని కోచ్ తెలిపారు. ఎంత బాగా సిద్దమైనా... ఎన్ని వ్యూహాలు అమలు చేసినా ప్రత్యర్థి జట్టును నిలువరించలేకపోతోందని... అందువల్లే ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అన్నారు. తమ క్రికెటర్లు అత్యుత్తమ ఆటతీరు కలిగినవారే... వారి నైపుణ్యంపై ఎలాంటి అనుమానం లేదన్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఆడటం వల్లే పాక్ వరుసగా ఓడిపోతోందని పాక్ కోచ్ పేర్కొన్నారు.
ప్రపంచ్ కప్ 2023 ని గెలవాలని పాక్ టీం భారత్ లో అడుగుపెట్టింది... కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేమని కోచ్ బ్రాడ్‌బర్న్ పేర్కొన్నారు. ఆటగాళ్ళు పూర్తి సామర్ధ్యంతో ఆడినా జట్టును గెలిపించుకోలేకపోవడం బాధాకరమని అన్నారు. తర్వాత బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో పాక్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ టీం కోచ్ బ్రాడ్‌బర్న్ తెలిపారు.