
స్వదేశంలో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భాగంగా తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో ఫైనల్ ఆడుతున్న సఫారీ మహిళలు బౌలింగ్ లో మెరిశారు. ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ ను 156 పరుగులకే కుదించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్.. ఆరు వికెట్లు కోల్పోయి 156 రన్స్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్ఖ) అర్థ సెంచరీతో ఆకట్టుకుంది. మిగిలిన బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ ను నిలువరించారు. బౌలింగ్ లో మెరిసిన సఫారీ జట్టు.. బ్యాటింగ్ లో కూడా రాణించి లక్ష్యాన్ని ఛేదించగలిగితే ఆ దేశం తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడినట్టే. మరి సౌతాఫ్రికా ఏం చేస్తుందో..?
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభమే అందించారు. అలీస్సా హీలి (18), బెత్ మూనీలు తొలి వికెట్ కు 36 పరుగులు జోడించారు. తాను ఎదుర్కున్న రెండో బంతికే ఫోర్ కొట్టిన హీలి.. రెండో ఓవర్లో కూడా ఫోర్ కొట్టి జోరు మీద కనిపించింది.
మరిజనె కాప్ వేసిన ఐదో ఓవర్ లో తొలి బంతికి హీలి ఫోర్ కొట్టింది. కానీ అదే ఓవర్లో ఆఖరి బంతికి కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న డి క్లెర్క్ కు క్యాచ్ ఇచ్చింది. తొలి పవర్ ప్లే ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
హీలి స్థానంలో వచ్చిన ఆల్ రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ (21 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నది కాసేపే అయినా మెరుపులు మెరిపించింది. మ్లబ వేసిన 8వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదిన ఆమె.. డి క్లెర్క్ వేసిన 9వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టింది. కానీ ట్రియాన్ వేసిన 12వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి కెప్టెన్ లుస్ చేతికి చిక్కింది. గార్డ్‌నర్ స్థానంలో వచ్చిన గ్రేస్ హారీస్ (10) ఎక్కువసేపు నిలువలేపోయింది. 14 ఓవర్లలో ఆసీస్ స్కోరు వంద పరుగులు దాటింది.
ఇస్మాయిల్ వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి బౌండరీ బాది హాఫ్ సెంచరీకి చేరువైన మూనీ.. కాప్ వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్ కొట్టి 44 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. . అయితే మిడిల్ ఓవర్స్ లో ధాటిగా ఆడిన ఆసీస్ బ్యాటర్లు చివర్లో మాత్రం తేలిపోయారు. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ ను నిలువరించారు. క్రీజులో ప్రమాదకర బ్యాటర్లు ఉన్నా వారికి హిట్టింగ్ చేసే అవకాశమివ్వలేదు. మారిజనె కాప్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ఆసీస్ సారథి మెగ్ లానింగ్ (10) ను భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ట్రియాన్ అద్భుతమైన డైవ్ క్యాచ్ తో ఆమెకు పెవిలియన్ కు చేర్చింది.
అయబొంగ వేసిన 17వ ఓవర్లో నాలుగు పరుగులే రాగా కాప్ వేసిన 18వ ఓవర్లో ఓ వికెట్ తీయగా 12 పరుగులు వచ్చాయి. అయబొంగ 19వ ఓవర్లో పది పరుగులే ఇచ్చింది. ఇక చివరి ఓవర్ వేసిన ఇస్మాయిల్.. రెండు వికెట్లు తీసి 12 పరుగులు ఇచ్చింది. ఫలితంగా ఆసీస్.. 156 పరుగులకే పరిమితమైంది. సఫారీ బౌలర్లలో ఇస్మాయిల్, మరిజనె కాప్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.