
ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సృష్టికి, ప్రతిసృష్టి చేసే నారీమణుల ఔన్నత్యాన్ని తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో మాత్రం మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరుగుతోంది...
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీకి మెల్లిమెల్లిగా ఆదరణ పెరుగుతోంది. మెన్స్ క్రికెట్‌తో పోలిస్తే, వుమెన్స్ క్రికెట్ మ్యాచులను చూసేందుకు కూడా క్రీడా ప్రేమికులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చేసే తప్పులు, ట్రూ క్రికెట్ ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేస్తున్నాయి...
క్రికెటర్ క్రీజులోకి వచ్చిన సమయంలో సదరు ప్లేయర్ల చేసిన పరుగులు, తీసిన వికెట్లు, వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు వంటి గణాంకాలను చూపించాల్సి ఉంటుంది. అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద మహిళా క్రికెటర్లకు సంబంధించిన ఎలాంటి గణాంకాలు అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
విండీస్ ప్లేయర్ చినెల్లే హెన్రీ క్యాచ్ పట్టిన వీడియోను చూపించిన సమయంలో ఆమె పేరును హేలీ మాథ్యూస్‌గా చూపించిన బ్రాడ్ కాస్టింగ్ టీమ్, సౌతాఫ్రికా బ్యాటర్ అయబొంగ ఖాఖా బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో ఆమె పేరును బసబట్టా క్లాస్‌గా చూపించారు..
పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలో పురుష క్రికెటర్లకు ఇచ్చే జీతంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు ఇవ్వడం లేదు. బీసీసీఐ పురుష క్రికెటర్లకు కాంట్రాక్ట్ A+ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తుంటే... మహిళా క్రికెటర్లకు మాత్రం A కేటగిరి ప్లేయర్లకు అత్యధికంగా రూ.50 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది...
మహిళా క్రికెట్ వీక్షించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో పురుష క్రికెట్ నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని వుమెన్ క్రికెటర్లకు చెల్లిస్తున్నామని చెబుతోంది బీసీసీఐ. ఈ వివక్షపై మహిళా క్రికెటర్లు కూడా నోరు మెదపకపోవడం విశేషం...
వుమెన్స్ బిగ్ బాష్ లీగ్ ప్రారంభమై, కొన్నేళ్లు గడుస్తున్నా వుమెన్స్ ఐపీఎల్ విషయంలో బీసీసీఐ ఎటూ తేల్చకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఐపీఎల్ ద్వారా వేల కోట్ల ఆదాయన్ని ఆర్జిస్తున్న భారత క్రికెట్ బోర్డు, మహిళా ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తే... భారత మహిళా జట్టుకి ఎంతో మేలు జరుగుతోందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయంపై ఎటూ తేల్చడం లేదు...
వుమెన్స్ ఐపీఎల్ మీద చర్చ వచ్చినప్పుడల్లా నాలుగు మ్యాచుల వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ను నిర్వహించి, చేతులు దులుపుకుంటున్న బీసీసీఐ, మహిళా ఐపీఎల్ టోర్నీ నిర్వహించేందుకు సరిపడినంత ప్లేయర్లు అందుబాటులో లేరని కామెంట్లు చేయడం విశేషం.
అయితే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో అదరగొడుతున్న స్వదేశీ, విదేశీ ప్లేయర్లకు అవకాశం ఇస్తే, 8 నుంచి 10 జట్లతో వుమెన్స్ ఐపీఎల్ టోర్నీని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించవచ్చని అంటున్నారు అభిమానులు. వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ మ్యాచులకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే, వుమెన్స్ ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...