ICC Women's World Cup: ఎదురేలేని ఆసీస్.. విండీస్ ను చిత్తుగా ఓడించిన కంగారూలు..

Published : Mar 15, 2022, 11:30 AM IST
ICC Women's World Cup: ఎదురేలేని ఆసీస్.. విండీస్ ను చిత్తుగా ఓడించిన కంగారూలు..

సారాంశం

ICC Women's World Cup 2022: ఆరు సార్లు మహిళల వన్డే ప్రపంచకప్ విజేత  ఆస్ట్రేలియా మళ్లీ ఆ దిశగా పరుగులు పెడుతున్నది.  ఈ టోర్నీలో ఆ జట్టుకు ఎదురేలేకుండా పోతున్నది. 

మహిళల వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాకు ఎదురే లేకుండా పోతున్నది. ఇప్పటికే ఆరు వన్డే ప్రపంచకప్ లను నెగ్గిన ఆ జట్టు..  ఏడో విశ్వకప్ కోసం  ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో ఆ జట్టు నాలుగు మ్యాచులు ఆడగా.. నాలుగింట్లో విజయం సాధించింది.  తాజాగా వెస్టిండీస్ తో జరిగిన గ్రూప్ 14 మ్యాచులో ఆసీస్ విజయఢంకా మోగించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా విఫలమైన వెస్టిండీస్ కు ఇది వరుసగా రెండో ఓటమి. గత మ్యాచులో ఆ జట్టు భారత్ తో ఓడిన విషయం తెలిసిందే. 

ఇక వెల్లింగ్టన్ వేదికగా  ఆసీస్-విండీస్ మధ్య జరిగిన మ్యాచులో  వెస్టిండీస్ టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకుంది.  కానీ ఆసీస్్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు.  ఇన్నింగ్స్ రెండో ఓవర్లో నాలుగు పరుగుల వద్దే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మాథ్యూస్ (0)ను పెర్రీ  క్లీన్ బౌల్డ్ చేసింది. తర్వాత బంతికే నైట్ (0)  కూడా.. కీపర్ హీలి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో 4 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 

 

ఈ క్రమంలో  బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ టేలర్.. (91 బంతుల్లో 50) ఒంటరి పోరాటం చేసింది. ఆమెకు వికెట్ కీపర్ క్యాంప్బెల్ (20) మాత్రమే సహకరించింది. మిగిలిన వాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లారు.  ఆసీస్ పేసర్ల ధాటికి ఆ జట్టు.. 45.5 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌటైంది.  పెర్రీ, గార్డ్నర్ కు తలో 3 వికెట్లు దక్కాయి. 

స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్  మొదట్లో కాస్త తడబడింది. ఏడు పరుగులకే ఆ జట్టు  రెండు వికెట్లు కోల్పోయింది. కానీ రాచెల్ హేన్స్ (95 బంతుల్లో 83 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆమెకు బెత్ మూనీ (28 నాటౌట్) సహకరించింది.  30.2 ఓవర్లలోనే ఆసీస్ లక్ష్యాన్ని అందుకుంది. 

ఈ విజయంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.  ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆసీస్ మహిళలు 4 మ్యాచులు ఆడి నాలుగు గెలిచారు. దీంతో ఆ జట్టు.. 8 పాయింట్లు (+1.744 నెట్ రన్ రేట్) తో టాప్ లో ఉన్నారు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా (3 మ్యాచులు.. 3 విజయాలు.. 6 పాయింట్లు) ఉంది. మూడో స్థానంలో ఇండియా (3 మ్యాచులు.. 2 విజయాలు.. 1 ఓటమి.. 4పాయింట్లు) ఉంది. ఇక నాలుగు మ్యాచులాడి రెండు విజయాలు, రెండు ఓటములతో ఉన్న కివీస్.. నాలుగో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. మూడు మ్యాచులాడి అన్నీ ఓడి  ఆఖరినుంచి రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్.. నాలుగింటికి నాలుగు   మ్యాచులు ఓడి ఆఖరి స్థానంలో నిలిచింది.  

PREV
click me!

Recommended Stories

Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !