అండర్ 19 ప్రపంచ కప్: ఫైనల్లో ఇండియా ప్రత్యర్థి బంగ్లాదేశ్

By telugu teamFirst Published Feb 7, 2020, 8:40 AM IST
Highlights

అండర్ 19 ప్రపంచ కప్ పోటీల సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో ఫైనల్ లో బంగ్లాదేశ్ ఇండియాను ఎదుర్కుంటుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. 

ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ పోటీల ఫైనల్లో భారత ప్రత్యర్థి ఖరారైంది. ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆదివారంనాడు ఫైనల్ మ్యాచు జరుగుతుంది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది.

ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైంది. ఇప్పటి వరకు ఏ ఫార్మాట్ లో కూడా ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్, ఇండియా తలపడలేదు. బంగ్లాదేశ్, ఇండియా ఫైనల్ మ్యాచులో తలపడడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి.

Also Read: అండర్-19 ప్రపంచకప్: పాక్‌పై ఘనవిజయం, ఫైనల్లో భారత్

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బంగ్లాదేశ్ బౌలర్ల ముందు వెలవెలబోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 

షోరిపుల్ హుస్సేన్ ధాటికి న్యూజిలాండ్ 25.4 ఓవర్లలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షోరిపుల్ హుస్సెన్ 45 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే లిడ్ స్టోన్ (44)తో కలిసి వీలర్ గ్రీనల్ (75 నాటౌట్) న్యూజిలాండ్ ఇన్నింగ్సును నిలబెట్టాడు. లిడ్ స్టోన్ అవుటైన తర్వాత వీలర్ గ్రీనల్ కు సరైన సహకారం అందలేదు. ఎంత కష్టపడినా చివరలో స్కోరును పెంచలేకపోయాడు. 

Also Read: పాక్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఓ పానీపూరీ సెల్లర్

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 32 పరుగులకే ఓపెనర్లు హసన్ ఇమామ్ (3), పర్వేజ్ హుస్సేన్ (14) వికెట్లు కోల్పోయింది. అయితే, మహ్మదుల్ హసన్ జాయ్ అద్భుతమైన సెంచరీతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. అతను 127 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. 

జాయ్ తౌహిద్ హృదయ్ (40)తో కలిసి మూడో వికెట్ కు 77 పరుగులు, సాదత్ (40 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్ కు 101 పరుగులు జోడించాడు. విజయానికి 11 పరుగులు కావాల్సిన దశలో మహ్మదుల్ ఔటయ్యాడు. బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్న్ి ఛేదించింది. తొలి సైమీ ఫైనల్ మ్యాచులో భారత్ పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే.

click me!