
పేరుకు అనామక జట్లే అయినా టీ20 మజాను అందించడంలో మాత్రం తామూ పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోమని నమీబియా, స్కాట్లాండ్ (Scotlamnd vs Namibia) రుజువు చేశాయి. టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) లో భాగంగా ఇక్కడ జరిగిన ఆసక్తికర పోరులో నమీబియా (Namibia)నే విజయం వరించింది. లో స్కోరింగ్ గేమ్ లో ఇరు జట్లు అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను అలరించాయి. స్కాట్లాండ్ (Scotland) నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా.. మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే విజయాన్ని అందుకుంది.
స్కాట్లాండ్ ను 109 పరుగులకే కట్టడి చేసిన ఆనందంలో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు మైకెల్ వాన్ లింగన్ (18), క్రెయిగ్ విలిమయ్స్ (23) రాణించారు. లక్ష్యం తక్కువగానే ఉందనో ధీమానో లేక.. మరేదైనా కారణమో గానీ నమీబియా ఆది నుంచి ఆచితూచి ఆడింది. ఫలితంగా తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు స్కోరు 16 పరుగులే. డేవి వేసిన ఐదో ఓవర్లో లింగన్ రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో పది పరుగులొచ్చాయి.
కానీ ఆ తర్వాత ఓవర్లోనే షరీఫ్.. మైకెల్ ను స్లో బాల్ తో బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని మిడ్ వికెట్ మీదుగా బాదిన మైకెల్.. బెర్రింగ్టన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ విలియమ్స్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డును పెంచాడు. తొమ్మిదో ఓవర్ చివరి బంతిని అతడు సిక్సర్ గా మలవడంతో స్కోరు 50 పరుగులు దాటింది. మరోవైపు మైకెల్ ఔటయ్యాక వచ్చిన వికెట్ కీపర్ గ్రీన్ (9), కెప్టెన్ ఎరాస్మస్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.
ఈ క్రమంలో స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నమీబియాపై ఒత్తిడి పెంచారు. 11 వ ఓవర్ నుంచి 15 ఓవర్ దాక 19 పరుగులే వచ్చాయి. 14 వ ఓవర్ ముగిసేసరికి.. సమీకరణాలు 36 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిందిగా ఉంది.
క్రెయిగ్ విలియమ్స్ ఔటయ్యాక వచ్చిన జెజె స్మిత్ (23 బంతుల్లో 32.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడాడు. డేవిడ్ వీస్ (16) తో కలిసి స్కాట్లాండ్ జట్టును విజయం వైపు నడిపించాడు. 15వ ఓవర్లో స్మిత్ సిక్సర్ బాదగా.. 17 వ ఓవర్లో వీస్ కూడా కూడా సిక్సర్ కొట్టాడు. కానీ అదే ఓవర్లో లీస్క్ వేసిన నాలుగో బంతికి షార్ట్ థర్డ్ మ్యాన్ మార్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
నమీబియా విజయం అంచుల మీద ఉన్నప్పుడు కూడా నాటకీయత చోటు చేసుకుంది. వీల్ 18 వ ఓవర్ వేసేనాటికి నమీబియా.. 12 బంతుల్లో 8 పరుగులు చేయాలి. తొలి బంతికి ఫ్రైలింక్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్మిత్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి మరో సింగిల్. స్కోర్ లెవలైంది. ఇకంా ఒక్క పరుగు చేస్తే విజయం నమీబియాదే అనగా.. ఫ్రైలింక్ ఔటయ్యాడు. ఆఖరికి చివరి ఓవర్ తొలిబంతిని సిక్సర్ కొట్టిన స్మిత్.. నమీబియా కు విజయాన్ని ఖాయం చేశాడు.
ఇక స్కాట్లాండ్ బౌలర్లు రాత్రి పూట పడుతున్న మంచును ఉపయోగించుకుంటూ కట్టుదిట్టంగానే బంతులేశారు. ఆ జట్టులో బ్రాడ్లీవీల్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. జోష్ డేవి, షరిఫ్ కూడా ఆకట్టుకున్నారు. షరిఫ్, గ్రీవ్స్, మార్క్ వాట్, లీస్క్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్ విజయంతో స్కాట్లాండ్ వరుసగా రెండు ఓటములు చవిచూడగా.. నమీబియా కు ఇది తొలి విజయం. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్ వెన్నువిరిచిన నమీబియా బౌలర్ రూబెన్ ట్రంప్మెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.