T20 Worldcup: కోహ్లీ.. ఆ ముగ్గురిని ఆడించు..! కివీస్ తో పోరుకు ముందు భారత సారథికి పాక్ మాజీ కెప్టెన్ సూచన

By team teluguFirst Published Oct 31, 2021, 1:07 PM IST
Highlights

Ind vs Nz: నేటి సాయంత్రం భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగునున్న బిగ్ ఫైట్ లో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటారు. అయితే ఈ పోరు కోసం టీమిండియాలో పలు మార్పులు చేయాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్..  భారత సారథి విరాట్ కోహ్లికి సూచించాడు. 

టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup2021) లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team India) నేడు న్యూజిలాండ్ (Newzealand) తో కీలకపోరులో తలపడనున్న విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే.  ఈ  బిగ్ ఫైట్ లో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటారు. అయితే ఈ పోరు కోసం టీమిండియాలో పలు మార్పులు చేయాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ (Salman Butt)..  భారత సారథి విరాట్ కోహ్లి (Virat Kohli)కి సూచించాడు. 

తన యూట్యూబ్ చానెల్ లో భట్ మాట్లాడుతూ.. భారత తుది జట్టులో  ఫిట్నెస్ లేమితో తంటాలు పడుతున్న హార్ధిక్ పాండ్యా బదులు.. శార్ధూల్ ఠాకూర్ ను తీసుకోవాలని సూచించాడు. స్పెషలిస్టు బ్యాటర్ గా ఇషాన్ కిషన్ (Ishan kishan) అద్భుతంగా ఆడుతున్నాడని, అతడిని కూడా ఆడించాలని చెప్పాడు. అంతేగాక.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూ అవకాశం ఇవ్వాలని భట్ తెలిపాడు. 

ఇదే విషయమై భట్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టీమిండియా అతడిని తుది జట్టులో ఆడించాలి. నేను ఈ విషయం చాలా కాలం నుంచి చెబుతున్నాను. ఇషాన్ తో పాటు.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా ఆడించాలి. అశ్విన్ మెరుగైన స్పిన్నర్. అంతేగాక వికెట్ తీసే సత్తా ఉన్న బౌలర్. అశ్విన్ చేర్పుతో భారత్ బౌలింగ్ కు మరింత బలం చేకూరుతుంది’ అని అన్నాడు. 

 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ (IPL) రెండో దశలో తాను ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన ఇషాన్.. ఆఖరు రెండు మ్యాచ్ లకు మాత్రం పుంజుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్ లో 50, ఆ తర్వాతి మ్యాచ్ లో 84 (సన్ రైజర్స్ మీద) బాదాడు. అంతేగాక.. టీ20 టోర్నీలలో భాగంగా ఇంగ్లండ్ తో భారత్ ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 46 బంతుల్లోనే 70 పరుగులతో వీర విహారం చేశాడు. 

హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్నెస్ ఇబ్బందులు ఎదుర్కుంటే అతడి స్థానంలో ఠాకూర్ ను ఎంపిక చేయాలని భట్ సూచించాడు. ‘పాండ్యా ఫిట్ గా లేకుంటే అతడి ప్లేస్ లో ఠాకూర్ ను తుది జట్టులో ఆడించాలి. ఠాకూర్.. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు’ అని తెలిపాడు. 

ఇదిలాఉండగా.. నేడు సాయంత్రం దుబాయ్ లో జరుగనున్న మ్యాచ్ రెండు జట్లకూ కీలకమే. గత రికార్డులు న్యూజిలాండ్ కు  అనుకూలంగా ఉన్నా.. ఆ జట్టుతో ఆడిన చివరి 5 టీ20లలో మాత్రం భారత్ దే విజయం.  మరి ఈ  బిగ్ ఫైట్ లో ఏ జట్టు గెలిచి సెమీస్  అవకాశాలను నిలుపుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 

click me!