T20 Worldcup: కీలక సమరం.. ఎవరిని వరించేనో విజయం..? నేడే భారత్-కివీస్ నాకౌట్ పోరు..

By team teluguFirst Published Oct 31, 2021, 12:18 PM IST
Highlights

India vs Newzealand: పాకిస్థాన్ తో జరిగిన  మొదటి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. మరో రెండు రోజుల తర్వాత ఆ జట్టు న్యూజిలాండ్ నూ చిత్తు చేసింది. ఇప్పటికే  3 మ్యాచ్ లు గెలిచిన పాక్.. సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నట్టే. ఇక.. నేటి సాయంత్రం జరిగే పోరులో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ బరిలో ఉంటారు.

ఒక్క మ్యాచ్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్.  యూఏఈ వేదికగా జరుగుతున్న  ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) టోర్నీలోని టైటిల్ రేసులో  హాట్ ఫేవరేట్ గా ఉన్న భారత్ తలరాతను మార్చింది. ఇక ఇంతవరకూ వన్డే ప్రపంచకప్ గానీ, టీ 20 ప్రపంచకప్ గానీ నెగ్గని జట్టు.. ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలని చూస్తుంటే దాని ఆశల మీద  నీళ్లు చల్లింది.  ఇద్దరి ప్రత్యర్థీ ఒక్కరే. రెండు జట్లు ఓడిపోయింది పాకిస్థాన్ (Pakistan) మీదే. ఇప్పుడు అవే రెండు జట్లు టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పోటీ పడబోతున్నాయి. నేటి సాయంత్రం భారత్-న్యూజిలాండ్ (India Vs Newzealand) మధ్య జరుగుతున్న పోరు ఒకరకంగా చెప్పాలంటే ప్రి క్వార్టర్స్ వంటిదే అనడంలో సందేహమే లేదు. 

గత ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన  మొదటి మ్యాచ్ లో టీమిండియా (Team India) ఓడిపోయింది. ఆ వెంటనే ఆ జట్టు.. మరో రెండు రోజుల తర్వాత న్యూజిలాండ్ (Newzealand) ను కూడా చిత్తు చేసింది.  ఇప్పటికే  3 మ్యాచ్ లు గెలిచిన పాక్.. సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నట్టే. ఇక.. నేటి సాయంత్రం జరిగే పోరులో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ బరిలో ఉంటారు. లేదంటే అద్భుతాలు, అవకాశాల కోసం కాలం వంక చూడాల్సిందే.

ఈ నేపథ్యంలో టీమిండియాకు ఈ పోరు కీలకం కానుంది. తొలి మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లోపాలు చాలానే ఉన్నాయి. మరి వాటిని నేడు సరిదిద్దుకుంటుందా..? లేదా కొనసాగుతుందా..? చూడాలి.  ఇక కివీలతో పోరాటం అంత తేలికేం కాదు. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై మనకు ఎంతటి ఘన చరిత్ర ఉందో.. మనపై న్యూజిలాండ్ కూ దాదాపు అంతే చరిత్ర ఉంది. 

చరిత్ర వాళ్లకే అనుకూలం..

2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ టోర్నీలలో  కివీస్ పై భారత్ మ్యాచ్ గెలవలేదు. గత ఐదు మ్యాచ్ లను చూస్తే వరుసగా.. 2007 (టీ20), 2016 (టీ20), 2019 (వన్డే వరల్డ్ కప్), 2021 (ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్) లలో న్యూజిలాండ్ దే పైచేయి.  అయితే చరిత్ర ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మొన్నటి భారత్-పాక్ మ్యాచే దానికి నిదర్శనం. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. పాకిస్థాన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మరి భారత్ కూడా న్యూజిలాండ్ గండాన్ని దాటుతుందా..? 

ఐసీసీ టోర్నీలలో ఫలితాలు ఎలా ఉన్నా మొత్తంగా టీ20 లలో చూసుకున్నా కివీస్ దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 16  సార్లు తలపడ్డాయి. అందులో 6 భారత్ గెలువగా.. 8 మ్యాచ్ లు కివీస్ వశమయ్యాయి. 2 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. కానీ.. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరు 5 టీ20లలో భారత్ దే విజయం. 

ఎవరి బలాలెంత..? 

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేపర్ మీద రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్ లో విఫలమైనా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఎప్పటికీ ప్రమాదకరమే. ఈ మ్యాచ్ లో వాళ్లు ఫామ్ అందుకుని మునపటి జోరు చూపెట్టాలని భారత్ ఆశిస్తోంది. ఇక  పాక్ తో మ్యాచ్ లో నిలకడగా ఆడిన కోహ్లి (Virat Kohli).. ఈ మ్యాచ్ లో చెలరేగాలని చూస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే పంత్ కూడా టచ్ లోనే ఉన్నాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫామే ఆందోళనకరంగా ఉంది. ఇక బౌలింగ్ లో బుమ్రా, షమీ పైనే ఆశలు. 

టీ20 టోర్నీ ఆరంభానికి ముందునుంచి భారత్ ను వేధిస్తున్న  సమస్య హార్ధిక్ పాండ్యా (Hardik Pandya). ఆల్ రౌండర్ గా జట్టులో ఉన్నా.. అతడు గత మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్ లో అతడు ఆడుతాడని విరాట్  కోహ్లి చెప్పకనే చెప్పాడు. అతడు ఆడితే భువనేశ్వర్ కు విశ్రాంతినిచ్చి.. శార్ధుల్ ఠాకూర్ ను గానీ మరో స్పిన్నర్ ను గానీ తీసుకునే అవకాశం ఉంది. హర్ధిక్ ను పక్కనబెడితే స్పెషలిస్టు బ్యాటర్.. ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు.

మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి మరో విధంగా ఉంది. ఆ జట్టు ప్రధాన బలం బౌలింగే. ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) కూడా తాను.. గత మ్యాచ్ లో భారత్ ను కోలుకోలేని దెబ్బతీసిన షహీన్ షా అఫ్రిది మాదిరే  టీమిండియాకు షాకిస్థానని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అతడిని ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు సవాలే. ఇక సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ కూడా ప్రమాదకరమే. వీళ్లే గాక నీషమ్, శాంట్నర్ కూడా భారత్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

 కానీ బ్యాటింగ్ లో విలియమ్సన్ (Kane Williamson) సేన  ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.   కేన్ మామ సరైన ఫామ్ లో లేడు. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పాదానికి గాయమైంది. ఈ మ్యాచ్ లో అతడు ఆడుతాడో లేదో ఇంకా తేలాల్సి ఉంది. వీరితో పాటు కాన్వే, ఫిలిప్స్, నీషమ్, సీపర్ట్ వంటి బ్యాటర్లు ఉన్నా వీళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. అంతేగాక కివీస్ కు సరైన ఫినిషర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. 

టాసే కీలకం: టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టుగా ఉంది ప్రస్తుతం టీ20 ప్రపంచకప్. ఈ టోర్నీలో ఇప్పటివరకు  జరిగిన 24 మ్యాచ్ లలో 18 మ్యాచ్ లలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుదే విజయం. ఇందులో టాస్ గెలిచాక ఫీల్డింగ్ ఎంచుకుని గెలిచిన మ్యాచ్ లు 13. దుబాయ్ లో మంచు పడే అవకాశం ఉంది. కావున టాస్ గెలిచిన జట్టే బౌలింగే ఎంచుకుంటుందనడంలో సందేహమే లేదు. పాకిస్థాన్ తో ఓడిపోయిన మ్యాచ్ లో భారత్.. న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు టాస్ గెలవలేదు. మరి ఈ మ్యాచ్ లో విజేతను నిర్ణయించేది టాసే కానుందా..? మరికొద్దిగంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది.  

తుది జట్లు అంచనా: 
 

టీమిండియా: రోహిత్ శర్మ,  కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా/ఇషాన్ కిషన్,  రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్/శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్:  మార్టిన్ గప్తిల్, మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, కాన్వే, ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ 

click me!