T20 Worldcup: పాకిస్థాన్ కోచ్ గా టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన మాజీ కోచ్.. పరిశీలనలో మరో ఇద్దరి పేర్లు..?

By team teluguFirst Published Oct 28, 2021, 2:59 PM IST
Highlights

Pakistan: టీ20  వరల్డ్ కప్ లో పాకిస్థాన్ అద్భుతాలు చేస్తున్నది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిలకడైన ఆటతీరుతో ఒకప్పటి పాక్ జట్టును గుర్తుకు తెస్తున్నది. అయితే.. ప్రస్తుతమున్న ముగ్గురు కోచ్ ల ఒప్పందం టీ20 టోర్నీవరకే. ఆ తర్వాత ఆ జట్టు కొత్త కోచ్ ను నియమించాల్సి ఉంది.

సుమారు ముప్పై ఏండ్ల తర్వాత.. వన్డే ప్రపంచకప్ లో భారత్  కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా (Team india) మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ (Gary kirsten) త్వరలో పాకిస్థాన్ (pakistan)హెడ్ కోచ్ కాబోతున్నాడు. అతడితో పాటు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నా.. పాకిస్థాన్ క్రికెట్  బోర్డు (పీసీబీ-PCB) చైర్మెన్ రమీజ్ రాజా (Ramiz raza) మాత్రం గ్యారీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ  అదరగొడుతున్న పాకిస్థాన్.. ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారీ కుదుపులు ఎదుర్కొంది. ఆ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న మిస్బా ఉల్ హక్ (Misbha ul haq), బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ (Waqar yunis).. తమ పదవులకు రాజీనామా చేశారు. పీసీబీ చైర్మెన్ గా రమీజ్ రాజా నియామకం నచ్చకే వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే  టీ20 టోర్నీ కోసం పాక్.. సక్లయిన్ ముస్తాక్ ను ఆ జట్టు తాత్కాలిక కోచ్ గా నియమించింది. ఆయనతో పాటు మాజీ ఆసీస్ ఆటగాడు మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ ఫిలాండర్ లను సహాయకులుగా నియమించింది. 

ఈ ముగ్గురి శిక్షణలో టీ20  వరల్డ్ కప్ లో పాకిస్థాన్ అద్భుతాలు చేస్తున్నది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిలకడైన ఆటతీరుతో ఒకప్పటి పాక్ జట్టును గుర్తుకు తెస్తున్నది. అయితే.. ఈ ముగ్గురు కోచ్ ల ఒప్పందం టీ20 టోర్నీవరకే. ఆ తర్వాత ఆ జట్టు కొత్త కోచ్ ను నియమించాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలోనే  దక్షిణాఫ్రికా మాజీ  ఆటగాడు, భారత మాజీ హెడ్ కోచ్  గ్యారీ కిర్స్టెన్ వైపు రమీజ్ రాజా చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక కిర్స్టెన్ తో పాటు ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్.. పీటర్ మూర్స్ (ఇంగ్లండ్) కూడా రేసులో ఉన్నా.. మొగ్గు మాత్రం  భారత మాజీ కోచ్ వైపే ఉందని సమాచారం. 

భారత్ కు ప్రపంచకప్.. టెస్టుల్లో నెంబర్ వన్.. 

2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన కోచ్ గా కిర్స్టెన్ బాధ్యతలు నిర్వర్తించాడు. జోరు మీదున్న ధోని సేనకు అతడు మార్గ నిర్దేశనం చేశాడు.  కిర్స్టెన్ వచ్చేటప్పటికీ విరాట్, రైనా, జడేజా వంటి ఆటగాళ్లు అప్పడే జట్టులోకి వచ్చారు. వాళ్లంతా కిర్స్టెన్ మార్గ నిర్దేశనంలో.. ధోని సారథ్యంలో రాటుదేలారు. అతడు కోచ్ గా ఉన్న సమయంలోనే భారత్.. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ  2011  వన్డే ప్రపంచకప్ నెగ్గింది. అంతేగాక టెస్టుల్లోనూ నెంబర్ 1 ర్యాంకును సాధించింది.

ఎంపిక లాంఛనమేనా..?

భారత్ కు హెడ్ కోచ్ గా రిటైరైన తర్వాత కిర్స్టెన్ దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ గా పనిచేశాడు. అంతేగాక.. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు , హోబర్ట్ హరికేన్స్ కు కోచ్ గా సేవలందించాడు. ఇక కటిచ్ కూడా గతంలో కోల్కతా నైట్ రైడర్స్ కు అసిస్టెంట్ కోచ్ గా ఉన్నాడు. మూర్స్ కూడా.. గతంలో ఇంగ్లాండ్ పురుషుల జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేసిన వ్యక్తే కావడం గమనార్హం. మరి ఈ ముగ్గురిలో  పాకిస్థాన్ హెడ్ కోచ్ బాధ్యతలు  చేపట్టేదెవరో టీ20 ప్రపంచకప్ తర్వాత తెలియనుంది. 

click me!