
టీ20 ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్స్ కు చేరిన న్యూజిలాండ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఇంగ్లాండ్ తో జరిగిన తొలి సెమీస్ లో ఆ జట్టు.. 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్లోకి దర్జాగా అడుగుపెట్టింది. ఛేదనలో కివీస్ జట్టు ఓపెనర్.. డరిల్ మిచెల్.. కాన్వే రాణించగా.. ఆఖర్లో వచ్చిన జిమ్మీ నీషమ్.. వీరవిహారం చేసి కివీస్ ను ఫైనల్స్ కు చేర్చాడు. అయితే ఈ విజయంపై కివీస్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్ లో ఆ జట్టు చాలా బాగా ఆడిందని భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు ప్రశంసల్లో ముంచెత్తారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు.. ఫైనల్స్ చేరినందుకు కివీస్ కు కంగ్రాట్స్ చెప్పారు.
సచిన్ ట్వీట్ చేస్తూ.. ‘ఎంత అద్భుతమైన క్రికెట్. న్యూజిలాండ్ మ్యాచ్ తో పాటు అందరి హృదయాలను కూడా గెలుచుకుంది. కాన్వే, నీషమ్ ల సాయంతో ఓపెనర్ మిచెల్ బాగా ఆడాడు. బెయిర్ స్టో ఉదంతం (బౌండరీ లైన్ వద్ద క్యాచ్) 2019 ఫైనల్స్ లో బౌల్ట్ ను గుర్తు చేసింది. న్యూజిలాండ్ జట్టుకు అభినందనలు..’ అని పేర్కొన్నాడు.
ఇక భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘వరల్డ్ కప్ లో అత్యుత్తమ ఆట. డరిల్ మిచెల్ అద్భుతంగా ఆడాడు. నీషమ్ గేమ్ ఛేంజర్. న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది. ఫైనల్స్ కు చేరుకున్నందుకు ఆ జట్టుకు అభింనదనలు..’ అంటూ ట్వీట్ చేశాడు
.
167 పరుగుల ఛేదనలో మొదటి మూడు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు (మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్) వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. మిచెల్, కాన్వేలు కలిసి మూడో వికెట్ కు 82 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇక 16వ ఓవర్ తర్వాత నీషమ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
కాగా.. టీ20 ప్రపంచకప్ లో కివీస్ జట్టు సమిష్టిగా రాణిస్తూ ముందుకుసాగుతున్నదని, సారథి కేన్ విలియమ్సన్ నాయకత్వం వల్లే న్యూజిలాండ్ గొప్ప విజయాలు సాధిస్తున్నదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. అతడు మాట్లాడుతూ.. ‘కివీస్ ఆటగాళ్లంతా వారి ప్రదర్శనపై నమ్మకంతో ఉన్నారు. చిన్నదేశం నుంచి వచ్చినా వాళ్లంతా సమిష్టిగా రాణించి గొప్ప విజయాలను అందుకుంటున్నారు. కెప్టెన్ విలియమ్సన్ జట్టులోకి ప్రతి ఆటగాడిని గౌరవిస్తాడు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పరిస్థితులకు తగ్గట్టు వారిని మలుచుకుంటాడు. విలియమ్సన్ వంటి గొప్ప నాయకుడి చేతిలో కివీస్ పగ్గాలుండటం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుత క్రికెటర్లలో అతడొక లెజెండ్..’ అంటూ ప్రశంసలు కురిపించాడు.