T20 World cup: కొత్త విజేతను చూస్తామా..? వరల్డ్ కప్ రెండో సెమీస్ లో పాక్ పై ఆసీస్ గెలిస్తే చరిత్రే..

By team teluguFirst Published Nov 11, 2021, 2:21 PM IST
Highlights

T20 World Cup Winners: రెండేండ్లకోసారి జరిగే టీ20 ప్రపంచకప్.. ప్రేక్షకులకు ఆటతో పాటు వినోదాన్ని కూడా పంచుతున్నది. 2007లో మొదలైన ఈ పొట్టి ప్రపంచకప్.. ఇప్పటివరకు ఆరు ఎడిషన్లు పూర్తయింది. ఐదు దేశాలు మాత్రమే టీ20 ప్రపంచకప్ ను సొంతం చేసుకున్నాయి. 

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. నేడు ఆస్ట్రేలియా-పాకిస్థాన్ ల మధ్య రెండో సెమీస్ జరుగనున్నది. ఈ మ్యాచ్ తర్వాత మిగిలింది ఇంకా ఒక్క మ్యాచే. నవంబర్ 14న దుబాయ్ లో తుదిపోరు. బుధవారం జరిగిన  ప్రపంచకప్ తొలి సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించిన న్యూజిలాండ్.. ఫైనల్లోకి ప్రవేశించింది. టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్స్ కు వెళ్లడం ఇదే ప్రథమం. ఇక నేటి మ్యాచ్ లో  ఆస్ట్రేలియా గనక పాకిస్థాన్ ను ఓడించి ఫైనల్స్ కు వెళ్తే ఈ  ప్రపంచకప్ లో కొత్త విజేతను చూడటం ఖాయం.  అలా కాకుండా పాక్ గెలిచినా.. ఆ అవకాశం న్యూజిలాండ్ రూపంలో ఉంది. 

రెండేండ్లకోసారి జరిగే టీ20 ప్రపంచకప్.. ప్రేక్షకులకు ఆటతో పాటు వినోదాన్ని కూడా పంచుతున్నది. 2007లో మొదలైన ఈ పొట్టి ప్రపంచకప్.. ఇప్పటివరకు ఆరు ఎడిషన్లు పూర్తయింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టోర్నీ ఏడో ఎడిషన్.  తొలి టీ20 ప్రపంచకప్ ఇండియా నెగ్గగా.. 2016 లో జరిగిన పొట్టి ప్రపంచకప్పులో వెస్టిండీస్ విజేత. ఇప్పటివరకు ఐదు దేశాలు మాత్రమే టీ20 ప్రపంచకప్ ను సొంతం చేసుకున్నాయి. టీ20 క్రికెట్ ఆడే దేశాల (ఐసీసీ ర్యాంకింగుల ప్రకారం)లో ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లు ఈ మెగా ట్రోఫీ అందుకోలేదు. 

టీ20 ప్రపంచకప్ విజేతలు.. 

- 2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా విజేత.. రన్నరప్ పాకిస్థాన్ 
- 2009 టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ విజేత.. రన్నరప్ శ్రీలంక 
- 2010 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజేత.. రన్నరప్ ఆస్ట్రేలియా 
- 2012 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ విజేత.. రన్నరప్ శ్రీలంక
- 2014 టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక విజేత.. రన్నరప్ ఇండియా 
- 2016 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ విజేత.. రన్నపర్ ఇంగ్లాండ్ 

2018లో టీ20 ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉన్నా.. ఆ తర్వాత ఏడాదే వన్డే ప్రపంచకప్ ఉండటంతో దానిని వాయిదా వేశారు. కానీ కొవిడ్ కారణంగా 2020 లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. దీంతో  ఈ ఏడాదితో పాటు 2022 లో కూడా టీ20 ప్రపంచకప్ (ఆస్ట్రేలియా) లో జరుగనున్నది.

కాగా.. బుధవారం జరిగిన వరల్డ్ కప్ తొలి సెమీస్ లో ఇంగ్లాండ్ ను న్యూజిలాండ్ ను ఓడించిన నేపథ్యంలో  ఈసారి కొత్త విజేత ఉద్భవించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు. అయిదు సార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ నెగ్గలేదు. 2010లో దగ్గరిదాకా వచ్చినా ఆఖరి మెట్టుపై బొక్క బోర్లా పడింది. కానీ ఈసారి ఎలాగైనా దానిని దక్కించుకోవాలని పట్టుదలతో కంగారూలు ఉన్నారు. అందుకు తగ్గట్టే ఆరోన్ ఫించ్ సారథ్యంలోని కంగారూలు.. జోరు కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు ఇంతవరకు వన్డే, టీ20 ప్రపంచకప్ నెగ్గని కివీస్.. ఈసారి మాత్రం  ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నది. 

2015, 2019 వన్డే ప్రపంచకప్పులలో ఆ దిశగా గొప్ప ప్రయత్నం చేసినా న్యూజిలాండ్ తుది మెట్టుపై  చతికిలపడింది. 2015లో ఆసీస్ చేతిలో దారుణ పరాజయం పాలైన కివీస్ కు.. 2019లో ఇంగ్లాండ్ పై దురదృష్టం బౌండరీల రూపంలో వెంటాడింది. కానీ కొంతకాలంగా ఆ జట్టు నిలకడైన ఆటతీరుతో అదరగొడుతున్నది. టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో  పాక్ చేతిలో ఓడిపోయినా.. ఆ తర్వాత గొప్ప పోరాట పటిమ ప్రదర్శించి నాలుగు మ్యాచులు గెలిచి  సెమీస్ లోకి ప్రవేశించింది. తమకు వన్డే ప్రపంచకప్ దూరం చేసిన ఇంగ్లాండ్ ను ఓడించి లక్ష్యం దిశగా ముందడుగు వేసింది. 

ఒకవేళ నేటి మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచినా.. ఫైనల్లో న్యూజిలాండ్ రూపంలో ప్రేక్షకులకు అవకాశం మిగిలే ఉంది. కానీ ఈ టోర్నీలో నిలకడైన ఆటతీరుతో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి జోరు మీదున్న పాక్ ను ఆసీస్ ఏ మేరకు అడ్డుకుంటుందనేది మరికొద్ది గంటల్లో తేలనున్నది.

click me!