T20 World cup: ఇండియాకు షాకిస్తామంటున్న స్కాట్లాండ్ కెప్టెన్.. తుక్కుతుక్కుగా ఓడించాలని చూస్తున్న భారత్..

By team teluguFirst Published Nov 5, 2021, 2:46 PM IST
Highlights

India Vs Scotland: సెమీస్ ఆశల కోసం గాల్లో దీపం పెట్టి చూస్తున్న టీమిండియా.. గత మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ ను ఓడించిన మాదిరిగానే నేటి పోరులో కూడా స్కాట్లాండ్ ను భారీ తేడాతో ఓడించాలని భావిస్తున్నది. వరుసగా రెండు పరాజయాల తర్వాత అఫ్గాన్ తో మ్యాచ్ లో గెలిచి రేసులోకి వచ్చిన భారత్.. ఈ మ్యాచ్ లో మాములుగా గెలిస్తే చాలదు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో శుక్రవారం సాయంత్రం దుబాయ్ లో భారత్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ సేనకు షాకిస్తామని స్కాట్లాండ్ సారథి కైల్ కొయెట్జర్ అంటున్నాడు. ఈ మ్యాచ్ లో తమ శాయశక్తులా ప్రయత్నించి టీమిండియాను ఓడించాలని జట్టంతా అనుకుంటున్నదన తెలిపాడు. దుబాయ్ లో నేడు సాయంత్రం ఇండియా-స్కాట్లాండ్ తలపడునున్నాయి.

క్వాలిఫైయింగ్ రౌండ్ లో పలు సంచలన ప్రదర్శనలు నమోదు చేసిన స్కాట్లాండ్.. సూపర్-12 కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేసింది. ఇంతవరకు ఆ జట్టు 3 మ్యాచులాడగా.. మూడింటిలో ఓడింది. కానీ గత మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఛేదన సందర్భంగా ఆ జట్టు బ్యాటర్లు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించారు. కేవలం 16 పరుగులతో కివీస్ చేతిలో ఓడిపోయారు. మరో రెండు ఓవర్లు ముందే హిట్టింగ్ చేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వారి పోరాటానికి కివీస్ కూడా దాసోహమైంది.  ఇక నేడు భారత్ తో పోరులో కూడా తమ బ్యాటర్లు ఇదే తెగువ చూపించాలని స్కాట్లాండ్ కెప్టెన్ కొయెట్జర్ ఆశిస్తున్నాడు. 

ఇండియాతో మ్యాచ్ కు ముందు అతడు మాట్లాడుతూ.. ‘మేము తదుపరి మ్యాచ్ లో భారత్ ను ఓడించాలని అనుకుంటున్నాము. భారత జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు. ఇది కఠినమైన సవాలు అని మాకు తెలుసు. కానీ మనపై మనకు నమ్మకం ఎప్పుడూ వీడకూడదు’ అని అన్నాడు. ‘మేం ఎక్కడ మెరుగ్గా ఉన్నామో అక్కడ మరింత సాధన చేయాలి. ప్రతి జట్టుకు ముందు మేం హోంవర్క్ చేస్తాం. భారత్ తో మ్యాచ్ కు ముందు కూడా అలాగే చేస్తున్నాం’ అని చెప్పాడు.

ఇంకా అతడు మాట్లాడుతూ..  టీ20 ప్రపంచకప్ సందర్భంగా తాము ప్రపంచంలోని పెద్ద జట్లతో మ్యాచ్ లు ఆడుతుండటం వల్ల మంచి అనుభవం సంపాదించామని అన్నాడు. ‘ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి జట్లతో ఆడటం మాకు ఓ అద్భుతమైన అవకాశం. ఈ టోర్నమెంట్ లో అత్యుత్తమ ఆటగాళ్లతో మేము ఆడుతున్నాం. కోహ్లి, విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి  స్టార్లతో మా ఆటగాళ్లు మాట్లాడాలని కోరుకుంటారు. వాళ్ల నుంచి మా  క్రికెటర్లు చాలా విషయాలు నేర్చుకోవాలి’ అని  తెలిపాడు. టాస్ సమయంలో కోహ్లి పక్కన నిలబడటం తనకే కాదు ఎవరికైనా  ప్రత్యేక సందర్భమని కోయెట్జర్ చెప్పాడు. 

ఇక సెమీస్ ఆశల కోసం గాల్లో దీపం పెట్టి చూస్తున్న టీమిండియా.. గత మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ ను ఓడించిన మాదిరిగానే నేటి పోరులో కూడా స్కాట్లాండ్ ను భారీ తేడాతో ఓడించాలని భావిస్తున్నది. వరుసగా రెండు పరాజయాల తర్వాత అఫ్గాన్ తో మ్యాచ్ లో గెలిచి రేసులోకి వచ్చిన భారత్.. ఈ మ్యాచ్ లో మాములుగా గెలిస్తే చాలదు. భారీ తేడాతో గెలిచి తీరితేనే  మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్య విషయం నమీబియా గానీ, అఫ్గనిస్థాన్ గానీ న్యూజిలాండ్ ను ఓడించాలి.  

ఆ సంగతెలా ఉన్నా.. గత మ్యాచ్ లో ఫామ్ ను అందుకున్న రోహిత్, రాహుల్ నేటి పోరులో కూడా మెరుపులు మెరిపించాలని చూస్తున్నారు. ఇక బర్త్ డే బాయ్ కోహ్లి నుంచి మరో సాధికారిక ఇన్నింగ్స్ కోసం ఫ్యాన్స్ గంపెడాశలతో ఉన్నారు. మిడిలార్డర్ లో రిషభ్, పాండ్యా కూడా కుదురుకున్నారు. బౌలింగ్ లో  సైతం భారత్ మెరుగైంది. అన్ని సానుకూలాంశాలే ఉన్నా.. స్కాట్లాండ్ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. టీ20 లో ఎప్పుడెవరు విజృంభించి గేమ్ ను తమవైపునకు తిప్పుకుంటారో  అంచనావేయడానికి వీళ్లేదు.

click me!