T20 World cup: మీ చేతగానితనాన్ని టాస్ తో ముడిపెట్టొద్దు.. టీమిండియా ఆటగాళ్లపై అజిత్ అగార్కర్ ఫైర్

By team teluguFirst Published Nov 8, 2021, 12:38 PM IST
Highlights

ICC T20 World cup 2021: ఈ ప్రపంచకప్ లో నాలుగు మ్యాచులాడిన విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా.. ఒక్కటంటే ఒక్కసారే టాస్ గెలిచింది.

ప్రపంచకప్ లో టీమిండియా ప్రస్థానం నేటితో ముగియనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఆ జట్టు.. కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే నిష్క్రమించడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే ఇండియా ఓటమిలో ఆటగాళ్ల వైఫల్యంతో పాటు టాస్ కూడా కీలక పాత్ర పోషించిందన్న వాదనపై మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ తీవ్రంగా స్పందించాడు.

భారత ఓటములకు టాస్ కారణం కానేకాదని అజిత్ అగార్కర్ అన్నాడు. తొలి రెండు మ్యాచులలో భారత బ్యాటర్ల పేలవ బ్యాటింగే టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు నిష్క్రమణకు కారణమని చెప్పాడు. 

అగార్కర్ మాట్లాడుతూ.. ‘భారత ఓటముల్లో టాస్ ది కీలక పాత్ర కానే కాదు.  వాళ్లు (టీమిండియా ఆటగాళ్లు) సరిగ్గా ఆడలేదు. ప్రపంచంలోని నెంబర్ వన్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా దారుణంగా విఫలమైంది. అదే భారత్ ను దెబ్బతీసింది. ఒకవేళ వాళ్లు పరుగులు చేసి ఓడిపోయుంటే ఓటుమల్లో టాస్ పాత్ర ఉందని అనుకోవచ్చు. ఆ సందర్భాల్లో టాస్ ను నిందించినా బాగుండేది’ అంటూ ఫైర్ అయ్యాడు. 

ఈ ప్రపంచకప్ లో నాలుగు మ్యాచులాడిన విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా.. ఒక్కటంటే ఒక్కసారే టాస్ గెలిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ పై విరాట్ టాస్ ఓడి బ్యాటింగ్ కు రావాల్సి వచ్చింది. ఫలితం అందరికీ తెలిసిందే. అఫ్గాన్ తో మ్యాచ్ లో కూడా విరాట్ టాస్ ఓడినా.. రోహిత్, రాహుల్, పంత్, పాండ్యాల విజృంభణతో భారత్ తొలి విజయం అందుకుంది. ఇక స్కాట్లాండ్ తో మ్యాచ్ లో మాత్రం విరాట్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ కు దిగాడు. 

కాగా..  అగార్కర్ తో పాటు ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ కూడా ఈ వివాదంపై స్పందించాడు. మూడీ మాట్లాడుతూ.. ‘భారత్ ఓటములకు టాస్ కారణం కానే కాదు. ఒత్తిడిలో  టీమిండియా బాగా ఆడలేదు.  ఇండియా ఓటములకు అదే ప్రధాన కారణం’ అని అన్నాడు. ఇదే విషయమ్మీద కామెంట్స్ చేసిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ చేసిన వ్యాఖ్యలపై లెజెండరీ క్రికెట్ సునీల్ గావస్కర్ కూడా ఫైర్ అయ్యాడు. టాస్ ఓడిపోవడం వల్ల తొలుత బ్యాటింగ్ చేశామని, అది తమ బ్యాటర్లపై తీవ్ర ప్రభావం చూపిందని అరుణ్ అన్నాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. ‘పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ మ్యాచులలో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత ఓటమికి  టాస్ గానీ మంచు గానీ కారకం కాదు. ముందు బ్యాటింగ్ చేసినప్పుడు మరో 30-40 పరుగులు చేసిఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి’ అని సన్నీ అన్నాడు. 

ఇదిలాఉండగా.. 2012 తర్వాత ఇండియా ఐసీసీ టోర్నీ సెమీస్ కు వెళ్లకపోవడం ఇదే తొలిసారి. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్.. 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ వరకు వెళ్లిన టీమిండియా.. యూఏఈలో జరుగుతున్న ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో కనీసం గ్రూప్ దశ కూడా దాటకపోవడం గమనార్హం. 

click me!