T20 Worldcup: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన షోయబ్ మాలిక్..!

By telugu news teamFirst Published Nov 8, 2021, 12:04 PM IST
Highlights

మాలిక్ స్కోరులో 1 ఫోరు, 6 సిక్సులు ఉండడం విశేషం. వీటిలో మూడు సిక్సులను మాలిక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కొట్టాడు. షోయబ్ మాలిక్ సిక్సర్ల వర్షం కురిపించాడు.

టీ20 వరల్డ్ కప్  లో పాకిస్తాన్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఐదు మ్యాచ్ లు ఆడగా.. ఆ ఐదు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. టోటల్ క్లీన్ స్వీప్ చేసేసింది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో తన చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు స్కాట్లాండ్ తో ఆడుతోంది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మిడిలార్డర్ లో షోయబ్ మాలిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్ల మోత మోగించిన మాలిక్ కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు సాధించాడు. మాలిక్ స్కోరులో 1 ఫోరు, 6 సిక్సులు ఉండడం విశేషం. వీటిలో మూడు సిక్సులను మాలిక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కొట్టాడు. షోయబ్ మాలిక్ సిక్సర్ల వర్షం కురిపించాడు.

అంతకుముందు కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి తన ఫామ్ చాటుతూ 66 పరుగులు చేశాడు. 47 బంతులు ఎదుర్కొన్న బాబర్ 5 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. వెటరన్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ 19 బంతుల్లో 31 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ 2 వికెట్లు తీశాడు. హమ్జా తాహిర్ 1, సఫియాన్ షరీఫ్ 1 వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో పాకిస్తాన్ జట్టు వరుసగా ఐదు విజయాలు అందుకుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, సూపర్ 12 రౌండ్‌లో ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. గ్రూప్ 1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్టు నాలుగేసి విజయాలు మాత్రమే అందుకోగలిగాయి.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా సౌతాఫ్రికా జట్టు నాలుగు విజయాలు అందుకున్నప్పటికీ నెట్ రన్ రేటు తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ 2లో మాత్రం నెట్ రన్ రేట్ అవసరం రాలేదు... పాకిస్తాన్ వరుసగా ఐదు విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరగా, ఆఫ్ఘాన్‌ను ఓడించి నాలుగో విజయం అందుకున్న న్యూజిలాండ్ కూడా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.

నవంబర్ 10న జరిగే మొదటి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్, 11న జరిగే సెమీ ఫైనల్ 2లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా జట్టు తలబడబోతున్నాయి. 190 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన స్కాట్లాండ్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 117 పరుగులకి పరిమితమైంది. జార్జ్ మున్సే 31 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, కెప్టెన్ కేల్ 16 బంతుల్లో 9 పరుగులు, మాథ్యూ క్రాస్ 5 పరుగులు, మైకెల్ లీస్క్ 14 పరుగులు చేసి అవుట్ కాగా, బడ్జ్ డకౌట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన రిచీ బెర్రింగ్టన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన బెర్రింగ్టన్ నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 19 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఏడాది టీ20ల్లో 1667 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, ఒక ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

click me!