T20 World cup: ఐపీఎల్, వరల్డ్ కప్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవేమో : టీమిండియా బౌలింగ్ కోచ్

By team teluguFirst Published Nov 7, 2021, 6:04 PM IST
Highlights

ICC T20 World Cup 2021: పాకిస్థాన్, న్యూజిలాండ్ పై వరుస పరాజయాల తర్వాత భారత  క్రికెట్ అభిమానులతో పాటు  పలువురు సీనియర్ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దీనిపై స్పందించాడు.

టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో తొలి  రెండు మ్యాచులలో భారత పేలవ ప్రదర్శనకు తీరికలేని షెడ్యూలే కారణమని విమర్శలు వినిపిస్తన్న తరుణంలో టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ (bharath Arun) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జూన్ లో  ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా (Team India).. అట్నుంచి  ఐపీఎల్-14 (IPL-14) రెండో దశ కోసం నేరుగా దుబాయ్ వెళ్లింది. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ కూడా మొదలైంది. దీంతో భారత్ (India) కు విశ్రాంతి దక్కలేదు. 

పాకిస్థాన్, న్యూజిలాండ్ పై వరుస పరాజయాల తర్వాత భారత  క్రికెట్ అభిమానులతో పాటు  పలువురు సీనియర్ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఆటగాళ్ల మానసిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ-BCCI) షెడ్యూల్ పెడితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై బీసీసీఐ ఇంతవరకూ స్పందించలేదు. 

అయితే భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దీనిపై స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ‘ఆరు నెలల పాటు తీరిక లేని క్రికెట్ ఆడటమనేది సవాలుతో కూడుకున్నదే. గత ఆరు మాసాలుగా భారత క్రికెటర్లు బయో బబుల్ లోనే గడుపుతున్నారు వాళ్లు చిన్న విరామం కూడా తీసుకోలేదు. ఇది భారీ నష్టాన్ని కలిగించింది. ఐపీఎల్, ప్రపంచకప్ మధ్య కొంత విరామం దొరికినా ఆటగాళ్లకు ఎంతో మేలు చేసేది’ అని తెలిపాడు. అలా జరిగుంటే టీ20 ప్రపంచకప్ లో భారత ప్రదర్శన, మ్యాచ్ ఫలితాలు మరో విధంగా ఉండేవని చెప్పాడు. 

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల కోసం జూన్ లో ఆ దేశానికి పయనమైన ఇండియా.. నాలుగు టెస్టులాడింది. తర్వాత కోచ్ రవిశాస్త్రితో పాటు ఇతర సహాయ సిబ్బందికి  కరోనా రావడంతో ఐదో టెస్టు అర్థాంతరంగా ముగిసింది. కాగా.. భారత జట్టు ఇంగ్లాండ్ నుంచి  దుబాయ్ కు వెళ్లింది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య ఐపీఎల్-14 జరిగింది. అక్టోబర్ 17 నుంచి  ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. 

న్యూజిలాండ్ తో ఓటమి తర్వాత టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) కూడా  పాత్రికేయుల సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తాము తీరిక లేని క్రికెట్ ఆడుతున్నామని,  బయో బబుల్ లో జీవితాల చాలా కఠినంగా ఉంటాయని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇదిలాఉండగా.. తాజాగా బీసీసీఐ షెడ్యూల్ మరోసారి చర్చనీయాంశమైంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన (నవంబర్14) వెంటనే టీమిండియా.. స్వదేశంలో న్యూజిలాండ్ తో టీ20, టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచకప్ ఫైనల్ కు,  న్యూజిలాండ్ తో సిరీస్ కు గ్యాప్ 3 రోజులు మాత్రమే.

ఇవీ చదవండి : Net Run Rate: ఏమిటీ నెట్ రన్ రేట్..? దానిని ఎలా లెక్కిస్తారు..? మెగా టోర్నీలలో దాని ప్రభావమెంత..?

IPL 2022: టీమిండియా కోచ్ పై కన్నేసిన ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. శాస్త్రికి డిమాండ్ మాములుగా లేదుగా..

 

click me!