Net Run Rate: ఏమిటీ నెట్ రన్ రేట్..? దానిని ఎలా లెక్కిస్తారు..? మెగా టోర్నీలలో దాని ప్రభావమెంత..?

By team teluguFirst Published Nov 7, 2021, 4:32 PM IST
Highlights

T20 World Cup 2021: నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. గ్రూప్-1లో సౌతాఫ్రికా తో పాటు ఆసీస్ కూ సమాన పాయింట్లున్నాయి. కానీ సౌతాఫ్రికా మాత్రం సెమీస్ కు వెల్లలేదు. ఎందుకు..?  సమాధానం నెట్ రన్ రేట్.. 
 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. పాయింట్ల పట్టికలో అది ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది.  రెండు జట్లు ఐదేసి మ్యాచ్ లు ఆడి.. నాలుగు విజయాలు సాధించి ఒకదాంట్లో ఓడిపోయాయి.  ఇరు జట్ల పాయింట్లు 8. కానీ దక్షిణాఫ్రికా ను కాకుండా ఆసీస్ సెమీస్ రేసుకు దూసుకెళ్లింది.. కారణం నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్). ఆసీస్ ఎన్ఆర్ఆర్ 1.216 కాగా.. దక్షిణాఫ్రికాకు 0.739 గా ఉంది. 
 
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఒక్కటే కాదు.. గతంలో కూడా పలు సందర్భాల్లో నెట్ రన్ రేట్ కారణంగా కొన్ని జట్లు పలు కీలక టోర్నీలలో  ఇంటి దారి పట్టాయి. ఐపీఎల్ వంటి లీగ్స్ లో అయితే  ఇది కీలక పాత్ర పోషిస్తున్నది. మరి అసలు  ఈ నెట్ రన్ రేట్ అంటే ఏమిటి.? దీనిని ఎలా లెక్కిస్తారు..? పాయింట్ల పట్టికలో జట్లపై దీని ప్రభావమెంత..? అన్న విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. 

నెట్ రన్ రేట్ : (టోర్నీలో ఒక జట్టు చేసిన మొత్తం పరుగులు ÷  మొత్తం ఇచ్చుకున్న పరుగులు) మైనస్ (టోర్నీలో ఆడిన మొత్తం ఓవర్లు ÷ టోర్నీలో వేసిన మొత్తం ఓవర్లు) 

గ్రూప్-2లో ఉన్న భారత్ ఎన్ఆర్ఆర్ (ఇప్పటివరకు 1.619) ను ఒకసారి లెక్కిద్దాం. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది. 
పాకిస్థాన్ తో 20 ఓవర్లలో 151-7.. న్యూజిలాండ్ తో 20 ఓవర్లలో 110-7.. అఫ్గానిస్థాన్ తో 20 ఓవర్లలో 210-2.. స్కాట్లాండ్ తో 6.3 ఓవర్లలో 89-2. 

ఈ టోర్నీలో టీమిండియా మొత్తం చేసిన పరుగులు.. 66 ఓవర్ల 3 బంతుల్లో (66.5 ఓవర్లు (గణన కోసం  హాఫ్ ఓవర్ ను 0.5 గా లెక్కిస్తారు)) 560. అంటే.. 560/66.5 = 8.421

ఇక  మనం ఇచ్చుకున్న పరుగులు.. పాకిస్థాన్ పై 17.5 ఓవర్లలో 152-0.. న్యూజిలాండ్ పై 14.3 ఓవర్లలో 111-2.. అఫ్గానిస్థాన్ పై 20 ఓవర్లలో 144-7.. స్కాట్లాండ్ పై 17.4 ఓవర్లలో 85-10. 
అంటే.. 72 ఓవర్లలో 492 పరుగులు.. 492/72= 6.802 

ముఖ్య గమనిక:  ఎన్ఆర్ఆర్ ను గణించేప్పుడు వికెట్లను పరిగణనలోకి తీసుకోరు.  ఒక జట్టు పూర్తి ఓవర్లు ఆడటానికి ముందే ఆలౌట్ అయితే అప్పుడు 20 ఓవర్లు గానీ లేకుంటే ఆ టీమ్ ఆడిన ఓవర్లను  గానీ పరిగణనకు తీసుకుంటారు. 

ఇక ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఎన్ఆర్ఆర్ ను తీయడం.. 8.421-6.802 = 1.619.. (ఇండియా ప్రస్తుతం ఎన్ఆర్ఆర్ ఇదే..) 


ప్రాముఖ్యత ఇదీ.. 
 

నెట్ రన్ రేట్ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు సమాన విజయాలు, సమాన పాయింట్లతో ఉన్నాయి. కానీ ముంబై ఎన్ఆర్ఆర్ -0.048 కాగా, కోల్కతాకు +0.587 ఉంది.  ప్లేఆప్స్ కు చేరుకోవాలంటే ముంబై జట్టు.. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 171 పరుగుల తేడాతో గెలిస్తే ఆ అవకాశం దక్కేది.  అందుకు తగ్గట్టుగా ముంబై బ్యాటర్లు తొలుత బ్యాటింగ్ చేసి 235 పరుగుల భారీ స్కోరు చేశారు. సన్ రైజర్స్ ను 65 పరుగుల లోపు నియంత్రించి ఉంటే ముంబై ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేది. కానీ అలా జరుగలేదు. ఫలితంగా.. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన  ముంబై.. ఈసారి ప్లేఆఫ్స్ చేరకుండానే  ఇంటిదారి పట్టింది. తాజాగా దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా ఇదే. కాగా.. అబుదాబిలో జరుగుతున్న న్యూజిలాండ్-అఫ్గాన్ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగి.. కివీస్ ను అఫ్గానిస్థాన్ ఓడిస్తే భారత్ సెమీస్ చేరడానికి ఈ నెట్ రన్ రేట్ కీలకం కానున్నది. అయితే ఇప్పటికీ గ్రూప్-2లో భారత్ కే ఎన్ఆర్ఆర్ ఎక్కువగా ఉండటం విశేషం. భారత్ కు కావాల్సిందల్లా అఫ్గాన్ అద్భుతం చేయడమే. 

click me!