
కాలం కలిసిరాకుంటే.. అదృష్టం మన వెంట లేకుంటే.. ఎంత గొప్ప ఆటగాడికైనా గడ్డుకాలం తప్పదు. ఒకప్పుడు భారత సారథి విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉండే క్రేజే వేరు. భారత క్రికెట్ కు రెండు వరల్డ్ కప్ లు అందించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో ఆటగాడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన విరాట్.. కెప్టెన్ గానూ తనను తాను నిరూపించుకున్నాడు. అయితే ఐసీసీ (ICC)టోర్నీల్లో మాత్రం అతడి వైఫల్యం కొనసాగుతున్నది. ఇక తాజాగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) లో మాత్రం భారత పేలవ ప్రదర్శన సగటు క్రికెట్ అభిమానికి కూడా ఆగ్రహం తెప్పించేలా ఉన్నది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ-BCCI) కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నది.
టీ20 వరల్డ్ కప్ కు ముందే తాను ఈ సిరీస్ అనంతరం పొట్టి ఫార్మాట్ కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని విరాట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ గా కోహ్లికి ఇది కీలక సిరీస్ కాబట్టి భారత్ తప్పకుండా కప్పు కొడుతుందని అందరూ భావించారు. కానీ విధి మరోలా తలచింది. కప్ కొట్టడం పక్కనబెడితే కనీసం సెమీస్ బెర్త్ అయినా దక్కినా మహాభాగ్యం అన్న రకంగా మారాయి ఇప్పుడు పరిస్థితులు. వరుసగా పాకిస్థాన్, న్యూజిలాండ్ పై చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా.. ఇప్పుడు ఇతర జట్ల అపజయాల మీద వేయి ఆశలు పెట్టుకున్నది.
రోహిత్ వైపే బీసీసీఐ మొగ్గు..
ఇదిలాఉండగా.. టీ20 ప్రపంచకప్ లో భారత పేలవ ప్రదర్శన కోహ్లి వన్డే సారథ్యం పైనా అనుమానాలు పెంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వన్డే సారథ్య బాధ్యతలను కూడా రోహిత్ (Rohit Sharma) కే అప్పగించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే టీ20 బాధ్యతలు అతడికే ఇవ్వనున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వన్డే కెప్టెన్ గా కూడా విరాట్ కు విశ్రాంతినిచ్చి రోహిత్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నది. దీనిపై మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భేటి అయి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ తో న్యూజిలాండ్ ఆడే టీ20 సిరీస్ నుంచే రోహిత్.. టీ20, వన్డే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోయే అవకాశం ఉంది. కోహ్లి మాత్రం టెస్టులకే పరిమితమయ్యే అవకాశాలే కనిసిస్తున్నాయి.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్లు చేస్తే అది కన్ఫ్యూజన్ కు దారితీసే అవకాశం ఉంది. మేము టీమిండియాకు వన్డే, టీ20లకు ఒక కెప్టెన్, టెస్టులకు ఒక కెప్టెన్ ఉండాలని భావిస్తున్నాం. వన్డే,టీ20 లకైతే రోహిత్ శర్మ బెస్ట్ ఛాయిస్ అని అనుకుంటున్నాం. దీనిపై వచ్చే వారం సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’ అని తెలిపారు.
న్యూజిలాండ్ పర్యటన ఇలా..
న్యూజిలాండ్ జట్టు.. నవంబర్ 17 నుంచి భారత్ తో మూడు టీ20 లుఆడనున్నది. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్ 17, 19, 21 న మూడు టీ20 లు.. 25-29 మధ్య తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య రెండో టెస్టు ఆడాల్సి ఉంది. దీని తర్వాత భారత్.. వచ్చే ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇదిలాఉండగా.. వచ్చే న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రస్తుతం జట్టులోని సీనియర్లందరికీ విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తున్నది.
ఈ ఏడాది నుంచి భారత క్రికెటర్లంతా విశ్రాంతి లేని క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు బయో బబుల్ లైఫ్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు కొత్త జట్టుతోనే కివీస్.. సిరీస్ ఆడనున్నది. అయితే ఈ సిరీస్ కోసం కోహ్లి తో పాటు రోహిత్ కు కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నది. అదే నిజమైతే.. రోహిత్ స్థానంలో కెఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టే ఛాన్సుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే అది కేవలం కివీస్ సిరీస్ కే అని.. విశ్రాంతి తర్వాత రెండు ఫార్మాట్ లలోనూ రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలు దక్కనున్నాయి.
ఇద్దరు కెప్టెన్ల రికార్డులు..
ఇక.. భారత సారథిగా విరాట్ నేతృత్వంలోని టీమిండియా 95 వన్డేల్లో 65 గెలిచి.. 27 ఓడిపోగా.. ఒక మ్యాచ్ రద్దైంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 10 వన్డేల్లో 8 గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టీ20లలో కోహ్లి కెప్టెన్సీలో భారత్ 45 మ్యాచ్‌ల్లో 27 గెలిచి.. 14 ఓడిపోగా.. 2 మ్యాచ్‌లు ఫలితం రాలేదు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 19 మ్యాచ్‌ల్లో 15 గెలిచి.. 4 ఓడిపోయింది.
తాత్కాలిక కోచ్ గా ద్రావిడ్..
కాగా.. వచ్చే బీసీసీఐ సెలక్షన్ కమిటీ భేటీలో కెప్టెన్సీ గురించే గాక కోచ్ పదవిపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత కొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక లాంఛనమే. అయితే అందుకు అధికారిక ప్రకటన రాకముందే కివీస్ తో సిరీస్ రానున్నది.దీంతో తాత్కాలిక కోచ్ గా ద్రావిడ్ బాధ్యతలు తీసుకోవాలని బీసీసీఐ కోరనున్నది.