T20 World cup: కోహ్లి, రవిశాస్త్రి, ధోని ఒకేతాటి మీద లేరనిపిస్తోంది.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ షాకింగ్ కామెంట్

By team teluguFirst Published Nov 3, 2021, 3:23 PM IST
Highlights

India vs Afghanistan: విరాట్ కోహ్లి, రవిశాస్త్రితో పాటు టీ20 ప్రపంచకప్ లో భారత్ కు మెంటార్ గా నియామకమైన ధోని ఒకే తాటి మీద లేరని  అనిపిస్తుందని పనేసర్ సంచలన కామెంట్స్ చేశాడు.  ఈ ముగ్గురి మధ్య సఖ్యత కొరవడిందని అన్నాడు.

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో వరుసగా రెండు పరాజయాలతో పేలవ ప్రదర్శన చేసిన భారత క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తున్నది. న్యూజిలాండ్ (Newzealand) తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేయడంపై విమర్శకులు స్వరం పెంచారు.  ఇదే విషయమై చాలా మంది సీనియర్లు  భారత సారథి విరాట్ కోహ్లి (Virat kohli), కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri)పై దుమ్మెత్తి పోస్తున్నారు. 

ఇక తాజాగా ఇదే విషయమై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్  (Monty Panesar)కూడా స్పందించాడు. విరాట్ కోహ్లి, రవిశాస్త్రితో పాటు టీ20 ప్రపంచకప్ లో భారత్ కు మెంటార్ గా నియామకమైన ధోని (MS Dhoni) ఒకే తాటి మీద లేరని  అనిపిస్తుందని సంచలన కామెంట్స్ చేశాడు.  ఈ ముగ్గురి మధ్య సఖ్యత కొరవడిందని పనేసర్ అన్నాడు.  భారత్ లోని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

పనేసర్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఇప్పటికి కూడా  ప్రపంచకప్ సెమీస్ కు అర్హత సాధించవచ్చు. వాళ్లు ఇప్పటికీ లైన్ లో ఉన్నారు. కానీ ఇది చాలా విషయాల మీద ఆధారపడిఉంది. ముఖ్యంగా  విరాట్ కోహ్లి, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనిలు ఒకేతాటి మీద ఉండాలి.  భారత్ ఏదైనా సాధించాలంటే ఈ ముగ్గురి మధ్య సఖ్యత అవసరం. కానీ వాళ్ల మధ్య అది కొరవడిందని నాకనిపిస్తున్నది’ అని పేర్కొన్నాడు. 

ఇక విరాట్ గురించి స్పందిస్తూ.. ప్రజలు విరాట్ ను గొప్ప ఛేజర్ గా, బ్యాటర్ గా చూసినంతగా సారథిగా చూడలేకపోతున్నారని అన్నాడు.  నాయకుడిగా కోహ్లి విఫలమయ్యాడంటూ కామెంట్స్ చేశాడు. ‘ఆధునిక  క్రికెట్ లో విరాట్ సందేహం లేకుండా గొప్ప బ్యాటర్. భారీ లక్ష్యాలు ఛేదించే సమయంలో కోహ్లి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. కానీ నాయకుడిగా మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జట్టు ఆపద సమయంలో ఉన్నప్పుడు సారథిగా విరాట్ చేసేది శూణ్యం’ అని పనేసర్ అన్నాడు. 

ఇదిలాఉండగా.. నేడు అఫ్గానిస్థాన్ తో తలపడబోతున్న భారత్ అందుకు పూర్తి సన్నద్ధంగా ఉంది. నేటి సాయంత్రం జరుగనున్న కీలక పోరులో భారీ తేడాతో గెలవాలని భారత్ కోరుకుంటున్నది. అయితే ఇందుకు సంబంధించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నెట్స్ లో తీవ్రంగా చెమటోడ్చారు. ప్రాక్టీస్ అనంతర కోహ్లి.. ధోని, రవిశాస్త్రితో కలిసి  సుమారు 30 నిమిషాల పాటు చర్చించాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత శాస్త్రి అక్కడ్నుంచి వెళ్లినా.. విరాట్, ధోని మాత్రం చాలా సేపు మ్యాచ్ గురించే మాట్లాడుకున్నట్టు తెలుస్తున్నది. 

click me!