T20 World cup: ముగ్గురు స్పిన్నర్లయితే తప్పేంటి..? అశ్విన్ ను మాత్రం కచ్చితంగా ఆడించాలి : గావస్కర్

Published : Nov 03, 2021, 02:23 PM IST
T20 World cup: ముగ్గురు స్పిన్నర్లయితే తప్పేంటి..? అశ్విన్ ను మాత్రం కచ్చితంగా ఆడించాలి : గావస్కర్

సారాంశం

India Vs Aghanistan: భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్.. టీమిండియాకు కొన్ని కీలక సూచనలు చేశాడు. జట్టులో ముగ్గురు స్పిన్నర్లుంటే తప్పులేదని, ఇక ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ను అయితే కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని అన్నాడు. 

ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో అడుగుపెట్టి చివరికి సెమీస్ బెర్త్ కోసం ఇతర జట్ల ప్రదర్శన మీద ఆధారపడిన టీమిండియా (Team india).. నేడు అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరిగే కీలక పోరులో తలపడనున్నది.  నేటి సాయంత్రం అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు ముందు భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar).. టీమిండియాకు కొన్ని కీలక సూచనలు చేశాడు. జట్టులో ముగ్గురు స్పిన్నర్లుంటే తప్పులేదని, ఇక ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (Ashwin) ను అయితే కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలంటూ  వ్యాఖ్యానించాడు. 

అఫ్గానిస్థాన్ తో మ్యాచ్ కు ముందు ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడిన సన్నీ.. ‘ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే వచ్చే నష్టమేమీ లేదు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భావిస్తే.. అప్పుడు మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ లలో ఎవర్నో  ఒకర్ని తప్పించడం మంచిది. ఎందుకంటే అబుదాబి పిచ్ లు  స్పిన్నర్లకు అనుకూలిస్తున్నాయి’ అని తెలిపాడు. 

అంతేగాక.. అశ్విన్ టాప్ క్లాస్ స్పిన్నర్ అని ఇలాంటి  స్లో పిచ్ లపై అతడు బాగా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే అశ్విన్,  జడేజా, రాహుల్ చాహర్ లతో వెళ్లాలని గావస్కర్ సూచించాడు. వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపడం లేదని అతడి స్థానంలో రాహుల్ చాహర్ ను ఆడించాలని సన్నీ చెప్పాడు. 

మిస్టరీ  స్పిన్నర్ గా పిలుస్తున్న వరుణ్ చక్రవర్తి (Varun chakravarthy) గత రెండు మ్యాచ్ లలో తేలిపోయాడు. అఫ్గాన్ బ్యాటర్లు కూడా వరుణ్ ను బాగా ఆడతారు. ఎందుకంటే ఆ జట్టులో వరుణ్ కంటే మిస్టరీ స్పిన్నర్లు చాలా మంది  ఉన్నారు. ‘అఫ్గాన్ జట్టులో ఉన్న మిస్టరీ స్పిన్నర్లను చూడండి. రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మాన్ తో పాటు ఇతరులు కూడా బాగా బౌలింగ్ చేయగలరు’ అని తెలిపాడు. 

ఇక నెలలకు నెలల పాటు కుటుంబాలను వదిలేసి బయో బబుల్ లో గడపడం కష్టంగా ఉందంటూ  కామెంట్ చేసిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా  (jasprit Bumrah)వ్యాఖ్యలపై కూడా గావస్కర్ స్పందించాడు. ‘మీరు భారత్ కోసం ఆడుతున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి.  మీకులాగే కొన్ని లక్షల మంది ఇండియన్ క్యాప్, జెర్సీని ధరించాలని అనుకుంటున్నారు. బయో బబుల్ కఠినంగా ఉందని సాకులు చెప్పకూడదు. మీరు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి. భారత అభిమానులు కూడా మీనుంచి కోరుకునేది ఇదే.  మీరు ప్రతి గేమ్ గెలవలేరని మాకూ తెలుసు. ఇది ఆట.  మీరు గెలవొచ్చు. ఓడొచ్చు. వ్యక్తిగత క్రీడలలో కూడా గొప్ప గొప్ప ప్లేయర్లు అనుకున్నవాళ్లు, జట్లు దారుణంగా ఓడిపోయాయి. ఇదంతా ఆటలో భాగం. కానీ తప్పులు చేయకుండా ఆడండి’ అని సూచించాడు.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !