T20 World cup: ఐసీసీ ఈవెంట్లలో భారత్ నిర్భయంగా ఆడదు.. టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

By team teluguFirst Published Nov 8, 2021, 5:35 PM IST
Highlights

Nasser Hussain: టీ20 ప్రపంచకప్ లో భారత ఆటతీరుపై స్వదేశానికి చెందిన అభిమానులు, సీనియర్లు, మాజీ క్రికెటర్లతో పాటు విదేశాలకు చెందిన క్రికెటర్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. తాజాగా ఇదే విషయమై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్  నాసిర్ హుస్సేన్ స్పందించాడు. 

పొట్టి ప్రపంచకప్ లో హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన టీమిండియా కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుండటాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్యాన్స్ తో పాటు మాజీ  క్రికెటర్లు,  సీనియర్లు కూడా ఇండియా ఆటతీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ తో పాటు విదేశాలకు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు కూడా టీమిండియా పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సంచలన కామెంట్స్ చేశాడు. 

ఐసీసీ ఈవెంట్లలో  టీమిండియా నిర్భయంగా ఆడదంటూ నాసిర్ హుస్సేన్ కామెంట్స్ చేశాడు. అతడు మాట్లాడుతూ.. ‘వాళ్ల (టీమిండియా)లో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. బహుశా ఐసీసీ ఈవెంట్లలో భారత్ ను వెనక్కి నెడుతున్నది కూడా ఇదే కావొచ్చు.  టాలెంట్ ఎంత ఉన్నా.. ఐసీసీ టోర్నీలలో మాత్రం నిర్భయంగా ఆడటంలో వాళ్లు విఫలమవుతున్నారు’ అంటూ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో టీమిండియా.. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో ఓడగా రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్నది. దీనికి ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది. తర్వాత రెండు మ్యాచుల్లో అనామక జట్లను ఓడించినా దాంతో మనకు ఒరిగిందేమీ లేదు. 

ఇంకా నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘నేను వాళ్లను (టీమిండియా) ఫేవరేట్లుగా భావించాను. స్టార్లు,  సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో ఉన్న ఆ జట్టుకు తొలి గేమ్ లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తొలి పవర్ ప్లేలో షాహిన్ అఫ్రిది వేసిన ఓవర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లను ఔట్ చేసిన బంతులైతే చాలా మంది క్రికెటర్లను ఔట్ చేసి ఉండేవి’ అని అన్నాడు. 

భారత్ కు టాపార్డర్ బలంగా ఉన్నా మిడిలార్డర్ వైఫల్యం వెంటాడుతుందని నాసిర్ అన్నాడు. ‘టాపార్డర్ లో వాళ్లు చాలా బలంగా ఉన్నారు. కానీ వాళ్లు విఫలమైనప్పుడు మిడిలార్డర్ లో అవసరానికి కావలసిన ఆటగాళ్లు లేరు. ప్లాన్ బీ ని ఇండియా కలిగి లేదు’ అని కామెంట్స్ చేశాడు.

కాగా.. ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమించడంపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఘాటుగా స్పందించాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లు (టీమిండియా) దేశానికి కాకుండా ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాళ్లకు మనమేం చెబుతాం. దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించాలి. ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం నాకు తెలియదు. కానీ.. వారి తొలి ప్రాధాన్యం ఫ్రాంచైజీల కంటే దేశానికే ఉండాలి. అలా అని నేను వాళ్లను అక్కడ (ఐపీఎల్) ఆడొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ బాధ్యత బీసీసీఐ మీద ఉంది. ఆటగాళ్లు మంచి ఆట ఆడటానికి అనుకూలంగా ఉండే విధంగా షెడ్యూళ్లను రూపొందించాలి. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి ఇదో (టీ20 ప్రపంచకప్ వైఫల్యం) మనకు మంచి అవకాశం..’ అని అన్నారు. 

click me!