Sri Lanka Cricket: భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షాపై శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రపంచకప్ విజేత కెప్టెన్ అర్జున్ రణతుంగ తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంక క్రికెట్ ను నాశనం చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Arjuna Ranatunga • Jay Shah: భారత్ లో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సందర్భంగా శ్రీలంక క్రికెట్ లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమి తర్వాత ఊహించని విధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దయింది. ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంకను అంతర్జాతీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. వీటన్నింటిలో ఇప్పుడు తదుపరి అంశం తెరపైకి వచ్చింది. శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అర్జున్ రణతుంగ చేసిన ఆరోపణలు మరెవరిపైనా కాదు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాపై.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా పేరును ప్రస్తావిస్తూ.. తన పదవిని ఉపయోగించుకుని శ్రీలంక క్రికెట్ బోర్డుకు నష్టం కలిగించారని అర్జున రణతుంగా ఆరోపించారు. జయ్ షా, శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు సన్నిహితంగా ఉన్నారనీ, వారు బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని నియంత్రించవచ్చని వ్యాఖ్యానించారు. అర్జున్ రణతుంగ శ్రీలంక వార్తాపత్రిక డైలీ మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "శ్రీలంక క్రికెట్ అధికారులు, జైషా మధ్య ఉన్న సంబంధాల కారణంగా శ్రీలంక క్రికెట్‌ను తాము నియంత్రించగలమని బీసీసీఐ భావిస్తోంది. జై షా శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడు. జై షా ఒత్తిడి శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తోంది అని ఆరోపించారు. అలాగే, 'భారత్‌కు చెందిన ఒక వ్యక్తి కారణంగా శ్రీలంక క్రికెట్ ఈ నష్టాన్ని చవిచూస్తోంది. జై షా అంత శక్తివంతమైనవాడు.. ఎందుకంటే అతని తండ్రి అమిత్ షా భారతదేశానికి హోం మంత్రిగా ఉన్నారు" అని అర్జున్ రణతుంగ వ్యాఖ్యానించారు.
కాగా, 2023 ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగారు. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నవంబర్ 2న వాంఖడే మైదానంలో శ్రీలంక, భారత్‌లు మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత శ్రీలంక క్రికెట్‌లో పెను పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌లపై మాత్రమే శ్రీలంక గెలుపొందింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నందున 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక ఆడలేకపోవచ్చు.