సూర్యాభాయ్‌కు అరుదైన గౌరవం కల్పించిన ఐసీసీ.. రాబోయే ప్రపంచకప్‌లో అతడి ఆటను తప్పక చూడాలంటూ ట్వీట్..

By Srinivas MFirst Published Oct 2, 2022, 5:38 PM IST
Highlights

Suryakumar Yadav: అసలుసిసలు టీ20 బ్యాటర్‌గా  రాణిస్తున్న  టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అరుదైన గౌరవం కల్పించింది. వచ్చే ప్రపంచకప్ లో అతడి ఆటను మిస్ కాకుండా చూడాలని ట్వీట్ చేసింది. 

గడిచిన ఏడాదికాలంగా టీ20లలో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమిండియా ‘మిస్టర్ 360’  సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ అరుదైన గౌరవమిచ్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బాబర్ ఆజమ్ వంటి క్రికెటర్లను కూడా కాదని సూర్య ఆటను చూడాలని ట్విటర్ లో పోస్ట్ చేసింది. రాబోయే టీ20  ప్రపంచకప్ లో  భాగంగా ఐదుగురు ఆటగాళ్ల మిస్ కాకుండా చూడాలని.. ఈ ఐదుగురు తమ ప్రదర్శనలతో అదరగొడతారని ఆశిస్తూ ఐసీసీ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఆ ఐదుగురిలో  సూర్యకుమార్ యాదవ్ కూడా ఉండటం గమనార్హం.  

ఈ జాబితాలో ఆస్ట్రేలియా  ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సారథి  జోస్ బట్లర్,  పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ లతో పాటు సూర్య కుమార్ యాదవ్ పేరు కూడా ఉంది. 

గడిచిన ఏడాదికాలంగా సూర్య అద్భుత ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది 21 టీ20లలో 40.66 సగటు, 180కి పైగా స్ట్రైక్ రేట్ తో..  732 పరుగులు చేసి టాఫ్  గేర్ లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల భారత విజయాల్లో  సూర్య  హస్తమే ఎక్కువ. 

 

A handful of players expected to dominate at the the 2022 ICC Men’s 🤔https://t.co/wjhZXgVvMP

— ICC (@ICC)

ఇక డేవిడ్ వార్నర్ విషయానికొస్తే గతేడాది ఆసీస్ టీ20  ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో వార్నర్ భాయ్.. 289 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా ఎంపికయ్యాడు. ఈ ఏడాది కూడా వార్నర్ అదే ఫామ్ ను కొనసాగిస్తాడని ఆసీస్ భావిస్తున్నది. గతేడదికాలంగా లంక క్రికెట్ లో వనిందు హసరంగ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు.  గత టీ20 ప్రపంచకప్ లో 16 వికెట్లు తీసిన అతడు ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.  

ఈ ఏడాది పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు అందుకున్న జోస్ బట్లర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ తో ఇంగ్లాండ్ ఆడుతున్న  టీ20 సిరీస్ లో అతడు అందుబాటులో లేకున్నా మేలో ముగిసిన ఐపీఎల్ లో బట్లర్ మెరుపులు మెరిపించాడు. అదే ఫామ్ ప్రపంచకప్ లో కూడా కొనసాగించాలని  ఇంగ్లాండ్ ఆశిస్తున్నది. 

మహ్మద్ రిజ్వాన్ గురించి చెప్పుకుంటే.. గత కొంతకాలంగా టీ20లలో నిలకడగా రాణిస్తున్న ఈ ఓపెనర్.. ఈ ఏడాది 12 మ్యాచ్ లు ఆడి 619 పరుగులు చేశాడు.  61.90 సగటుతో ఏడు  హాఫ్ సెంచరీలు చేసిన రిజ్వాన్ ఇటీవలే టీ20లలో  అగ్రస్థానాన్ని   చేజిక్కించుకున్నాడు. 

click me!