360 డిగ్రీస్ మీ వల్ల కాదు గానీ కనీసం 180 డిగ్రీల ఆటైనా ఆడగలరా..? పాక్ బ్యాటింగ్‌పై మాజీ సారథి ఆగ్రహం

By Srinivas MFirst Published Oct 2, 2022, 4:53 PM IST
Highlights

PAK vs ENG T20I: ప్రపంచకప్‌కు ముందు  ఇంగ్లాండ్ తో స్వదేశంలో ఏడు మ్యాచ్ ల  సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ బ్యాటింగ్  లో దారుణంగా విఫలమతున్నది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ సారథి వసీం అక్రమ్.. పాక్ బ్యాటింగ్ పై విమర్శలు గుప్పించాడు. 

టీ20 క్రికెట్  అంటేనే బాదుడు. ఇక్కడ క్లాస్ షాట్ల కంటే  వీర బాదుడు బాదే మాస్ ఆటగాళ్లకే క్రేజ్ ఎక్కువ.  క్లాసు, మాసు కలగలిపి ఆడే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను భారత అభిమానులు అందుకే ‘మిస్టర్ 360 డిగ్రీస్’ అని పిలుచుకుంటుంటారు.  గతంలో ఈ బిరుదు సౌతాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కు ఉండేది. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమ్.. ఆ జట్టుకు చెందిన బ్యాటర్లను 360 డిగ్రీల ఆట మీ వల్ల కాదుగానీ కనీసం అందులో సగం.. అంటే 180 డిగ్రీల ఆట అయినా ఆడగలరా..?  అని ప్రశ్నలు సంధిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ సిరీస్ లో పదే పదే విఫలమవుతున్న  మిడిలార్డర్ బ్యాటింగ్ పై అక్రమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. 

ఈ రెండు జట్ల మధ్య  రెండ్రోజుల క్రితం లాహోర్ లో ముగిసిన ఆరో టీ20 లో కూడా మిడిలార్డర్ వైఫల్యం చెందడంతో  అక్రమ్ ఈ కామెంట్లు చేశాడు. మ్యాచ్ అనంతరం  అక్రమ్.. పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అక్రమ్ మాట్లాడుతూ... ‘ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ ను చూడండి. టీ20 ఆటకు అతడు చక్కటి ఉదాహరణ. పేసర్లను ఎంత ధీటుగా ఎదుర్కుంటున్నాడో స్పిన్నర్లనూ అంతే ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. అతడు స్టేడియం నలుమూలలా షాట్లు ఆడుతున్నాడు. ఒకవేళ నేను ఇప్పుడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆడినా పాకిస్తాన్ బ్యాటర్లు షాట్లు ఎక్కడ కొడతారో అంచనా వేయగలుగుతా. ఆ మేరకు నేను బౌలింగ్ చేస్తా. అసలు పాకిస్తాన్ బ్యాటర్లలో ఏదైనా కొత్తరకమైన షాట్ ఆడదామన్న ధోరణి కనిపించడం లేదు.. 

మీరు 360 డిగ్రీల ఆట ఆడమని నేను కోరడంలేదు.  అలా అడగడం కూడా మీనుంచి అతిగా ఆశించినట్టే అవుతుంది. కనీసం 180 డిగ్రీల ఆటైనా ఆడండి. నెట్స్ లో  ఏ షాట్స్ ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేస్తున్నారా..? ఒకవేళ చేస్తే దానిని మ్యాచ్ లో ఎందుకు అమలుచేయడం లేదు...?’ అని ప్రశ్నించాడు. అక్రమ్ చెప్పినట్టు.. పాకిస్తాన్ ఈ సిరీస్ లో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్  తప్ప మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీలు  క్రీజులో నిలవడానికే ఇబ్బంది పడుతున్నారు.  

 

England make it 3️⃣-3️⃣ with a game to go 🏏 | pic.twitter.com/GDwkVbUURk

— Pakistan Cricket (@TheRealPCB)

అక్రమ్ ప్రశ్నలకు  యూసుఫ్ స్పందిస్తూ.. ‘నేను దానిమీదే దృష్టిపెట్టా. కోచ్ సక్లయిన్ ముస్తాక్ తో కూడా దీనిగురించే మాట్లాడుతున్నా. స్పిన్నర్లు బౌలింగ్ కు దిగినప్పుడు  డిఫరెంట్ షాట్స్ ఆడాలని మన బ్యాటర్స్ కు చెబుతున్నా.  ఏదైనా కొత్తగా షాట్ ఆడితే ఎలా ఉంటుందన్నది కూడా ప్రాక్టికల్ గా  చేసి చూపిస్తున్నాం.  నెట్స్ లో అది ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ మాకు సరైన ప్రాక్టీస్ మ్యాచ్ లు లేకపోవడంతో  అసలు మ్యాచ్ లకు వచ్చేసరికి  వ్యూహాలు దెబ్బతింటున్నాయి.. టీ20లలో ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే తాపత్రయం ఎక్కువగా ఉంది.  బౌండరీ వెళ్లకుంటే కనీసం సింగిల్ అయినా తీద్దామనుకుంటున్నారు. ఆ ఆత్రుతలో  వికెట్లు కోల్పోవాల్సి వస్తున్నది..’ అని తెలిపాడు. 

click me!