IPL2022 CSK vs DC: డివాన్ కాన్వే హాఫ్ సెంచరీ... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

By Chinthakindhi RamuFirst Published May 8, 2022, 9:29 PM IST
Highlights

ఐపీఎల్ 2022 సీజన్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన డివాన్ కాన్వే... రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం... శివమ్ దూబే మెరుపులు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొనఊపిరితో ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కొత్త పెళ్లికొడుకు డివాన్ కాన్వే, వరుసగా మూడో హాఫ్ సెంచరీతో చెలరేగడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

Latest Videos

ఆ తర్వాత శివమ్ దూబేతో కలిసి రెండో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు డివాన్ కాన్వే. 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు చేసిన డివాన్ కాన్వే, సీజన్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీకి చేరువైన కాన్వేని ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు...

19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన శివమ్ దూబే, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెంటవెంట ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే...

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో 19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదిన అంబటి రాయుడు, ఆ తర్వాతి బంతికి అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన మొయిన్ ఆలీ కూడా నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే రాబిన్ ఊతప్ప గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

క్రీజులోకి వస్తూనే మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో 6, 4 బాదిన ఎమ్మెస్ ధోనీ... 8 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో సీఎస్‌కే 200+ మార్కుని దాటగలిగింది.

సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన కుల్దీప్ యాదవ్, నేటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం కావడం విశేషం. తొలి ఓవర్‌లో 18, రెండో ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్... 3 ఓవర్లలో 43 పరుగులు సమర్పించాడు. కుల్దీప్ పూర్తి కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు.

ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా ఆన్రీచ్ నోకియా 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.  మిచెల్ మార్ష్ ఓ వికెట్ తీయగా ఢిల్లీ క్యాపిటల్స్‌లోని మిగిలిన బౌలర్లు ఎవ్వరూ వికెట్ తీయలేకపోయారు. 

click me!