
టీమిండియా ఆడిన తొలి వన్డేలో ఆడి.. ఇప్పటికీ భారత జట్టు తరఫున మెరుపులు మెరిపిస్తున్న ఏకైక క్రికెటర్ దినేశ్ కార్తీక్. తన పని అయిపోయిందని.. ఇక అతడు జట్టులోకి తిరిగి రావడం కలే అనుకుంటున్న తరుణంలో ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనలతో తిరిగి భారత జట్టులో పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లో కూడా అంచనాలకు మించి రాణిస్తున్న కార్తీక్.. తన తర్వాత లక్ష్యం రాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున ఆడటమేనని స్పష్టం చేశాడు.
నాలుగో మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీ కోసం హార్ధిక్ పాండ్యా.. కార్తీక్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్బంగా పాండ్యా.. 'చాలా మంది దినేశ్ కార్తీక్ పని అయిపోయిందన్నారు. అలాంటి కార్తీక్ ఇలా మారడానికి కారణాలేంటి..? నీలో వచ్చిన మార్పులేమిటి..?' అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు కార్తీక్ సమాధానం చెబుతూ.. ‘చూడు హార్ధిక్. నేను రాబోయే టీ20 ప్రపంచకప్ (2023)లో ఆడాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. అది ఎంత విలువైందో నాకు తెలుసు. నా తదుపరి లక్ష్యమదే. నా జీవితంలో అది చాలా ముఖ్యమైనది. దాని గురించి నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. ప్రపంచకప్ ప్రాబబుల్స్ లో మనపేరు లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను చాలాసార్లు దానిని అనుభవించాను. అందుకే నేను టీమిండియా కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాను. అదృష్టవశాత్తూ ఐపీఎల్ లో ఆర్సీబీ నాకు ఆ అవకాశాన్నిచ్చింది. నిజం చెప్పాలంటే నేను అక్కడ నా పాత్రను చాలా ఆస్వాదించాను.
నేనిక్కడికి రావడానికి ఎంతగానో సాధన చేశాను. అందుకే ఇవాళ ఇక్కడ ఉన్నాననుకుంటున్నా. భారత జట్టుకు కఠిన సమయాల్లో విజయాలు అందించే ఆటగాడిగా నేను మారాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం జట్టులోకి రావడం ఎంత కఠినమైన సవాలో నాకు తెలుసు. కొత్త కుర్రాళ్లు, యువతతో జట్టులో కొత్త వైబ్స్ వస్తున్నాయి. ఈ జట్టుతో ఉండటం చాలా కొత్తగా సంతోషంగా ఉంది..’ అని ముగించాడు.
రాజ్కోట్ మ్యాచ్ లో 27 బంతుల్లో 55 పరుగులు చేసిన కార్తీక్ ఈ సీరిస్ లో గత మూడు మ్యాచులలో పెద్దగా బ్యాటింగ్ చేసే ఆస్కారం లేకపోయినా తన పాత్రను అద్భుతంగా పోషించాడు. అంతకంటే ముందు ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున.. 16 మ్యాచులలో 330 రన్స్ చేసి ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు.
అయితే దినేశ్ కార్తీక్ ను టీ20 ప్రపంచకప్ లో తీసుకోవాలా..? వద్దా..? తీసుకుంటే అతడికి ఏం పాత్ర ఇవ్వాలి..? ఇప్పటికే రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ రూపంలో టీమిండియాకు నలుగురైదుగురు వికెట్ కీపర్లున్నారు. వీళ్లందరినీ కాదని కార్తీక్ ను ఎలా తీసుకుంటారు..? వంటి ప్రశ్నలతో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం.. వయసు, పేరు వంటివి చూడకుండా ఆటగాళ్ల ఫామ్ చూసి జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నాడు. మరి కార్తీక్ ఇదే ఫామ్ ను టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగించగలడా..? అలా ఆడితే మాత్రం ఆసీస్ కు వెళ్లబోయే జట్టులో కార్తీక్ పేరు కూడా ఉంటుందనడంలో సందేహమే లేదు.